ఏపీలో అధికార పార్టీ వైసీపీ దౌర్జన్యాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. రాజ్యాంగం కల్పించిన హక్కుతో ఎన్నికల్లో పోటీ చేసేందుకుగాను నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తే వైసీపీ కార్యకర్తలు ఇతర పార్టీల అభ్యర్థులను అడ్డుకోవడంపై జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల అభ్యర్థులను బెదిరించి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపించారు. దాడులకు పాల్పడటం, బెదిరింపులకు దిగడం వైసీపీ మానుకోవాలని చెప్పారు. ఇదే పద్ధతి కొనసాగితే ఊరుకోబోమని హెచ్చరించారు.
సోమవారం అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వ్యవహారిస్తోన్న తీరును వారిని అడిగి తెలుసుకొని కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తీరుపై కేంద్ర హోమ్ శాఖకు, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు.
అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఢీల్లీ వెళ్తారు అనేది మాత్రం చెప్పలేదు. త్వరలోనే ఆయన ఢీల్లీ వెళ్లాలనే యోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక, పోలీసుల వ్యవహారశైలిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులపై దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు. పార్టీ నేతలపై దాడుల జరిగిన చోట నుంచి రిపోర్ట్ లను తెప్పించుకొని కేంద్రానికి అందజేయాలని ఆయన అనుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో చోటు చేసుకున్న హింస, దౌర్జన్యాలు సంఘటనల వారీగా, దాడులు చేసి ఇబ్బందిపెడుతున్నా చర్యలు తీసుకొని అధికారులు, నామినేషన్ దశలో ఆర్.ఓ.ల వ్యవహార శైలిపై వివరాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి సత్వరమే పంపించండని ఆయన పార్టీ నేతలకు సూచించారు.