ఆయన అమాయకుడో అర్ధం కాదు.. మాయకుడో తెలియడం లేదు. ఎవరన్నా చెప్పినట్లు ఆడుతున్నాడో అర్ధం కాదు.. ఆయనే అలా ఆడతాడో తెలియడం లేదు.. రాక రాక అమరావతికి వచ్చిన పవన్ కల్యాణ్ ప్రసంగాలు వింటే.. రాజకీయ వైరాగ్యం కలిగేలా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రజలు కూడా తనంత అమాయకంగా ఆలోచిస్తారని అనుకుంటున్నట్లు అనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పోలవరంపై, అమరావతిపై రెండిటిపైనా బిజెపి లైనుకు ఏ మాత్రం తేడా లేకుండా చాలా జాగ్రత్తగా పదాలు ఏరుకుని మాట్లాడినట్లు ఉంది. ఎక్కడా తన స్వతంత్ర భావాలను గాని.. జనసేన గతంలో ప్రకటించిన విధంగా గాని.. లేదు.
పోలవరం ప్రాజెక్టు కట్టాల్సిందే.. నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే. మరి ఎక్కడి నుంచి ఇస్తారు నష్టపరిహారం.. కేంద్రం ఇస్తేనే కదా. మరి రాష్ట్రం కడుతుంది కాబట్టి.. బాధ్యత కేంద్రానిది అని అనలేమంట. రామ రామ.. ఈయనే దగ్గరుండి కేంద్రంతో మాట్లాడి ఇప్పించాల్సింది పోయి.. అడగలేము అందుకు ఎవరో కారణమని చెప్పడమంటే.. అది దొంగాట అనాలా లేక .. తొండాట అనాలా. వైసీపీ ఏమో ఎత్తు తగ్గించేది లేదంటుంది.. మరి కేంద్రం దానికి తగ్గట్టు డబ్బులు ఇస్తుందా అంటే.. చంద్రబాబు ఎలా రిపోర్టు తయారు చేస్తే అలా ఇచ్చేయాలా అని సోము వీర్రాజు అడుగుతారు. చంద్రబాబు రిపోర్టునే ఫాలో అయి డబ్బులివ్వమని అడిగిన వైసీపీ నేతలు.. కేంద్రం ఇలా చేయడానికి కారణం టీడీపీయే అంటారు. ఇందరు ఇన్ని డ్రామాలాడుతుంటే.. నిలదీయాల్సిన జనసేనాని మాత్రం.. ఊ ఆ అంటూ నసుగుతున్నాడు.
ఇక అమరావతిపైనా అదే తంతు. రైతులు పోరాటం చేయకూడదా.. బంగారం వేసుకోకూడదా.. కులం అంటగడతారేంటి.. అంటూ వైసీపీ విమర్శలన్నిటికి సమాధానాలిచ్చాడు. బిజెపి విధానం అమరావతే ఏకైక రాజధాని.. మాది అదే అన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. మరి అమరావతినే రాజధానిగా ఉంచేలా ఈయన గాని, బిజెపి గాని ఏం చేస్తారో చెప్పటం లేదు. రైతులు మంచోళ్లు అని చప్పట్లు కొట్టించుకోవడం కాదు.. ఆ మంచోళ్లను ఆదుకోవడం ఎలా అనేదే చూడాలనే కామెంట్లు వస్తున్నాయి. పైగా ప్రభుత్వం ఇంకా అధికారికంగా అమరావతిని తరలిస్తామని చెప్పలేదంట.. చెప్పాక.. ఏం చేయాలో చూస్తాడంట.
బిజెపితో మాట్లాడకుండానే.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించేశారు. వాళ్లేమో పొత్తులేమీ లేవంటున్నారు. ఆంధ్రా వాళ్ల ఓట్ల కోసమే అసలీ అమరావతి, పోలవరం డ్రామాలనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏమో చెప్పలేం.. పవన్ భయ్యా అలా కూడా చేయొచ్చని అభిమానులు కూడా అంటున్నారు.
మొత్తం మీద ఎనిమిది నెలలు దీక్షలు, షూటింగులతో గడిపేసి.. రెండు రోజులు కాల్షీట్లు అమరావతికి ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చారు. ఈ రెండు రోజులు తూతూ మంత్రం మాటలే తప్ప.. అడుగు ముందుకు పడే విధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు పవన్ కల్యాణ్. ప్రత్యేకంగా సమావేశాలు.. అమరావతి రైతులతో భేటీ అంటే.. అందరూ చాలా ఎక్స్ పెక్ట్ చేశారు.. కాని ఏమీ అవలేదు. పైగా అందరిలాంటి పార్టీ కాదు.. ఒక మాట అంటే కట్టుబడి ఉండాలి.. తొందరపడి అనకూడదు.. చాలా బెదిరింపులు ప్రలోభాలు ఉన్నా గట్టిగా నిలబడ్డాం.. అంటూ ఫిలాసఫీ చెబుతుంటారు.. అసలు సంగతి మాత్రం చెప్పరనే విమర్శలు వస్తున్నాయి.