నందమూరి బాలకృష్ణ హోస్టు చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే షో హై రేటింగ్స్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ షోలో సూపర్ స్టార్స్, ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ మొదటి ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అయింది. తాజాగా రెండో ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేసింది ఆహా. ఈ ప్రోమో చూస్తుంటే పవన్ తన లైఫ్ లో జరిగిన కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది.
తొలి ఎపిసోడ్ లో పవన్ కల్యాణ్ వ్యక్తిగత – సినిమా జీవితం పైన ఎక్కవగా ఫోకస్ చేసిన బాలకృష్ణ రెండో ఎపిసోడ్ లో రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సినిమాల్లో పవర్ స్టార్ గా ప్రతీ ఒక్కరూ అభిమానించే పవన్ కల్యాణ్ కు ఆ అభిమానం ఓట్లుగా మారకపోవటం పైన బాలయ్య ప్రశ్నించారు. దీనికి స్పందగాన సినిమా అభిమానం వేరని..ఓటుగా మారటం వేరని పవన్ క్లారిటీ ఇచ్చారు. సినీ అభిమానం ఓటుగా మారాలని లేదన్నారు.
రాజకీయాల్లోనూ అదే స్థాయిలో పేరు రావాలంటే అంతే కష్టపడాలన్నారు. రాజకీయాల్లో నిలబడి ఉండటం అవసరమని చెప్పారు. రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవని వివరించారు. తాను ఇంకా నమ్మకం సంపాదించుకొనే స్థితిలోనే ఉన్నానని పవన్ క్లారిటీ ఇచ్చారు. సినీ రంగంలో స్టార్ డమ్ రాజకీయాల్లో ఎన్టీఆర్..ఎంజీఆర్ కే వచ్చిందని పవన్ పేర్కొన్నారు. పార్టీ నిర్మాణమంటే ఐడియాలజీ ని నిర్మించటమని పవన్ చెప్పుకొచ్చారు.
పవన్ ఈ ఎపిసోడ్ లో మరో ఎమోషనల్ అంశం బయట పెట్టారు. తనకు చిన్నప్పటి నుంచి ఆస్తమా, జ్వరం ఉండేవన్నారు. సరైన స్నేహితుల్లేక ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చేదని చెప్పారు. పరీక్షల ఒత్తిడి నచ్చేది కాదన్నారు. స్నేహితులంతా ఉన్నత చదువులు, క్రికెట్ లో రాణిస్తున్న సమయంలో తాను పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయానని ఓపెన్ గా చెప్పారు. ఆత్మన్యూనతా భావం ఉండేదన్నారు. 17 ఏళ్ల వయసులోనే మానసికంగా కుంగిపోయానని చెప్పారు. చనిపోతే బాగుండు అనిపించిందన్నారు.
అన్నయ్య లైసెన్స్ రివాల్వర్ తీసుకొని కాల్చుకుందామనుకున్నానని చెప్పారు. సురేఖ వదిన.. నాగబాబు గమనించి ఎందుకలా ఉన్నావని ఆ సమయంలో అడిగారని..కాల్చుకుందామనుకుంటున్నానని తాను చెప్పటంతో తనను వారిద్దరూ చిరంజీవి అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లారని వివరించారు. పరీక్షలపైన దిగులు కారణంతో ఇలా ప్రవర్తిస్తున్నానని వాళ్లు చెప్పటంతో.. చదవకపోయినా పర్వాలేదని..బతికి ఉండరా అని చిరంజీవి చెప్పారని పవన్ నాటి అంశాలను చెప్పుకొచ్చారు.
టీడీపీలో ఎందుకు చేరలేదంటూ పవన్ ను బాలయ్య ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ లోనూ చేరలేదని పవన్ సమాధానం ఇచ్చారు. అప్పటికే ఉన్న పార్టీలకు సిద్దాంతాలు..లక్ష్యాలు ఉన్నాయన్నారు. తాను కొన్ని మూల సిద్దాంతాలతో రాజకీయాలతో కొనసాగుతున్నట్లు చెప్పారు. అధికారం ఉన్నా..లేకున్నా ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా అడుగులు వేయాలనే తాను రాజకీయ పార్టీని పెట్టుకున్నట్లు పవన్ స్పష్టం చేసారు.
ఇదే సమయంలో రాజకీయంగానూ కీలక వ్యాఖ్యలు చేసారు. తన పార్టీ ఆవిర్భావ సభకు స్థలమిచ్చారనే ఇప్పటంలో ప్రభుత్వం ఇళ్లను కూల్చివేయించందని చెప్పారు. తాను వారికి మద్దతుగా వెళ్తుంటే అడ్డుకొనే ప్రయత్నం జరిగిందన్నారు. మొదటి సారి తనకు తిక్క వచ్చిందన్నారు. ఎవరు ఆపుతారో చూస్తా.. కేసులు పెట్టుకోమని చెప్పానని వెల్లడించారు. అందుకే తాను కారు పైకి ఎక్కి కూర్చోవాల్సి వచ్చిందని వివరించారు.