జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన విశాఖ పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. శనివారం జరిగిన పరిణామాల నేపథ్యంలో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో జనవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశామని తెలిపారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 5 నెలల క్రితమే జనవాణి కార్యక్రమం నిర్ణయం చేసామన్నారు. విశాఖ గర్జనకు పోటీగా మేము ఈ కార్యక్రమం పెట్టలేదన్నారు. వారి కార్యక్రమం భగ్నం చేసే ఉద్దేశ్యం మాకు లేదన్నారు పవన్. అయినా మేము ఏం చెయ్యాలో కూడా వైసీపీ నేతలే చెబుతారా? అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఏ కార్యక్రమం చేస్తామో మీకు చెప్పాలా? అని నిలదీశారు.
జనవాణి జనం గొంతుక. సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తే మా దగ్గరకు ఎందుకు వస్తారు? మూడు వేలకు పైగా పిటిషన్లు ఎందుకు ఇస్తారు? వాటికి సంబంధించి ఆయా శాఖలకు తెలిపామన్నారు పవన్. మా తండ్రి ఓ పోలీస్ కానిస్టేబుల్. అందుకే నాకు పోలీసులంటే చాలా గౌరవం. మీ మీద నమ్మకం లేదన్నా నాయకుడు ఇప్పుడు సీఎం అయ్యారు. శనివారం వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు కొమ్ముకాసారు. మీరు అంత పవర్ ఫుల్ అయితే వివేకానంద హత్య కేసును ఎందుకు చేధించలేకపోయారని ప్రశ్నించారు. ఎందుకు నిందితులను అరెస్ట్ చేయలేదన్నారు.
గంజాయి వ్యాపారం చేసే వారిని, దోపిడీలను చేసేవారిని వదిలేస్తారు. ప్రజల సమస్యలు గొంతెత్తితే.. మా గొంతు నొక్కేస్తారు. నేను మూడు సార్లు పెళ్లి చేసుకున్నానని మూడు రాజధానులు పెట్టాలా? మీరు కూడా విడాకులిచ్చి. పెళ్లిల్లు చేసుకోండన్నారు పవన్. కడుపు కాలినవాడు గర్జిస్తాడు. మీరు చేసిన గర్జన ఏంటో నిన్ననే తెలిసింది. మేము పోలీసులతో గొడవ పెట్టుకోవడం, ఘర్షణ చేయడం మాకు చేతకాక కాదు. పోలీసులంటే గౌరవం ఉంది. పోలీసులు నన్ను రెచ్చగొట్టేందుకు చాలా ప్రయత్నించారు. అభివాదానికి ప్రతివాదం చేస్తే 100 మందిని తీసుకెళ్లారు.
సంబంధం లేని వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అన్నారు పవన్. 2014లోనే విశాఖ, కర్నూలు, అమరావతి రాజధాని అని ఎందుకు చెప్పలేదన్నారు. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం వల్ల అనేక పరిశ్రమలు వెళ్లిపోయాయి. వాటాలు లేవని ఇలా చేస్తారా? ఒక వ్యక్తి చేతుల్లో అధికారం ఉంచుకొని మీరు వికేంద్రీకరణ గురించి మాట్లాడతారా? అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. వైసీపీ గూండా గాళ్లకు ఒక్కటే చెబుతున్నా.. మీ ఉడత ఊపులకు నేను భయపడను. జనవాణి వినతులు తీసుకోవాలి. కానీ మా వాళ్లను విడిచి పెట్టేంత వరకూ జనవాణి నిర్వహించం. వాళ్లు వచ్చే వారకు ఎదురుచూస్తానన్నారు పవన్ కళ్యాణ్.
కాగా విశాఖ ఎయిర్ పోర్ట్ లో శనివారం ఏపీ మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై జరిగిన దాడి ఘటనపై ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనతో ఏ తమకు సంబంధం లేదని పవన్ పేర్కొన్నారు. తాను వైజాగ్ లో అడుగుపెట్టడానికి ముందే ఈ ఘటన జరిగిందని కూడా వెల్లడించారు. విశాఖ చేరాక తాను రెచ్చగొట్టడం వల్లే గొడవ జరిగినట్లుగా నోటీసుల్లో పేర్కొన్నారని, అందులో వాస్తవం లేదని తెలిపారు పవన్ కళ్యాణ్.