ప్రశ్నించే గొంతుక జనసేన అంటూ పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తారని అంతా భావించారు. బీజేపీతో మిత్రధర్మం కోసం గ్రేటర్ బరి నుండి జనసేన తప్పుకోవటం, పవన్ అత్యవసరంగా ఢిల్లీ వెళ్లటంతో పవన్ బీజేపీ తరుపున గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని అంతా భావించారు.
అంతకు ముందు దుబ్బాక ఉప ఎన్నికల్లో పవన్ ప్రచారం చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. అదిగో వచ్చేస్తున్నారు అంటూ బీజేపీ నేతలు అనధికారికంగా ప్రకటనలు ఇచ్చినా పవన్ రాలేదు. ఉప ఎన్నిక కదా రాలేదనుకున్నారు. కానీ గ్రేటర్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మంగా తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రులంతా క్యూ కట్టి ప్రచారం చేస్తున్నారు. దీంతో పవన్ కూడా బీజేపీకి ప్రచారం చేస్తారని అంతా భావించారు. ఆయా డివిజన్లలో ఆంధ్రా నుండి వచ్చి ఉంటున్న ప్రజలున్న చోట్ల అయితే నాయకులంతా సంబురపడ్డారు.
కానీ ప్రచార పర్వం చివరి దశకు వచ్చేస్తున్నా పవన్ వచ్చే సూచనలు కనపడటం లేదు. మరో రెండ్రోజుల్లో ప్రచారం కూడా ముగియనుంది. దీంతో పవన్ కళ్యాణ్ వచ్చేది అనుమానంగా కనపడుతుంది. కేవలం మద్ధతు ప్రకటనకే పరిమితం అయినట్లేనని బీజేపీ శ్రేణులు కాస్త అసంతృప్తిగానే ఉన్నాయి.