జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిసెంబర్ 1 వ తేదీ నుంచి ఆరు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రస్తుతం రాయలసీమలో ఉన్న పరిస్థితులు, సమస్యలపై రైతాంగం, మేధావులతో చర్చించనున్నారు. సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చడంలో పాలక పక్షం చూపిస్తున్న నిర్లక్ష్యం మూలంగా ఇబ్బందులు పడుతున్న వారిని కూడా పవన్ ఈ పర్యటనలో భాగంగా కలవనున్నారు. డిసెంబరు 1 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి మొదట కడప జిల్లాకు పవన్ వెళ్లనున్నారు. 3 గంటలకు రైల్వే కోడూరు లో కడప జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చించి, కడప జిల్లా పార్టీ నేతలు శ్రేణులతో చర్చించనున్నారు.
రాత్రికి తిరుపతిలో బస చేసి 2 వ తేదీ ఉదయం 10 గం. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 3 వ తేదీన కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్షిస్తారు. ఇక 4 వ తేదీ మదనపల్లె లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని, శ్రేణులకు దిశానిర్దేశం చెయ్యనున్నారు. 5 వ తేదీ అనంతపురం జిల్లా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం స్థానిక రైతులు, చేనేత కార్మికులతో చర్చలు జరపనున్నారు. 6 వ తేదీన పార్టీ కార్యక్రమాలలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్ తరువాత హైదరాబాద్ కు చేరుకోనున్నారు.