పవన్ కల్యాణ్, జనసేన అధినేత
ఏపీలో రహదారులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో వివరాలను పెడితేగానీ వైసీపీ ప్రభుత్వం కళ్లు తెరవలేదు. ఇప్పుడు తేరుకుని రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై దృష్టి పెట్టింది. లక్షలాది మంది రోడ్ల సమస్యలను చెప్పారు. వర్షాలు తగ్గాక అక్టోబర్ తర్వాత రోడ్డు మరమ్మతుల ప్రక్రియ మొదలుపెడతామని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. అప్పుడు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లను నిర్ణయించి పనులు మొదలుపెట్టాలంటే సంక్రాంతి వస్తుంది. ఇక పనులెప్పుడు పూర్తవుతాయో? అప్పటి వరకూ ప్రజలకు ఈ గోతుల రోడ్లే గతి కావచ్చు.
ఇన్నాళ్లు రోడ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టనే లేదు. నిజంగా శ్రద్ధ ఉంటే వర్షాకాలం ముగిసిన వెంటనే పనులు మొదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసేవారు. ప్రతి జనసేన నాయకుడు, జన సైనికుడు తమ పరిధిలోని రోడ్లకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించాలి. ఏ రోడ్డు ఎన్ని కిలో మీటర్ల మేర దెబ్బతిన్నదో.., మరమ్మతులతో బాగు చేయవచ్చా, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలా లాంటి వివరాలను పరిశీలించాలి. ప్రభుత్వం చెప్పిన విధంగా అక్టోబర్ తరవాత మీ పరిధిలోని రోడ్డుకు మోక్షం కలుగుతుందో లేదో చూసేందుకు, అభివృద్ధి చేయాల్సిన రోడ్డును మరమ్మతులతో సరిపెట్టే పక్షంలో ప్రశ్నించేందుకు ఈ వివరాలు అవసరం. రాష్ట్రంలో ప్రతి రోడ్డూ బాగుపడే వరకూ జనసేన పార్టీ గళమెత్తుతుంది.