వైద్య విద్యార్థిని ప్రీతి మృతి పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం అత్యంత బాధకరమని తెలిపారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రీతి ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత అధికారులు సరైన రీతిలో స్పందించి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.
సైఫ్ వేధింపులు భరించలేక ప్రీతి బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితులు, కన్నవారి మానసిక వేదన గురించి తెలుసుకొంటే హృదయం ద్రవించిందని అన్నారు పవన్. ప్రీతి మృతికి కారణమైన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులు అరికట్టాలన్నారు.
మరోవైపు తన కూతురు ప్రీతీది ముమ్మాటికి హత్యేనంటున్నారు ఆమె తండ్రి. ప్రీతికి సైఫ్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడని అనుమానం వ్యక్తం చేశారు. పక్కా ప్లాన్ తో చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించానని.. విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు.