జగన్ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతోందని విమర్శించారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తిరుపతి నగరంలో ఇటీవల బలిజ సమాజిక వర్గానికి, యాదవ సామాజిక వర్గానికి మధ్య చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటన నేపథ్యంలో పవన్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
కులాల మధ్య చిచ్చు రేపి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే బలిజలకి, యాదవులకి మధ్య దూరం పెరిగేలా కుట్రలకు తెర తీశారన్నారు. కులాల మధ్య అంతరాలు తగ్గించి, అందరి మధ్య సఖ్యతను పెంచేందుకు జనసేన పార్టీ తపిస్తోందని పవన్ పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సమాచారం అందుతోందని, ఈ కుతంత్రాలు తిరుపతి నగరంలో మొదలయ్యాయని వెల్లడించారు. ఈ ఉచ్చులో ఎవరూ పడకుండా, ఈ తరహా కుతంత్రాలకు పాల్పడుతున్న వారిని ఆదిలోనే నిలువరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు.
‘ఇవాళ తిరుపతి.. రేపు మరొక ప్రాంతం కావొచ్చు.. బలిజలకీ, యాదవులకు మధ్య దూరం పెరిగేలా కుట్రలకు తెర తీశారు.. ప్రజల మధ్య సఖ్యత లేకుండా, భేదభావాలతో ఉండేలా చేయడమే కుట్రదారుల పన్నాగం.. ఈ తరుణంలో అన్ని కులాల వారు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలి.. ఇలాంటి వారికి ప్రజాస్వామ్య పంథాలోనే సమాధానం ఇవ్వాలి.. అందరూ ఒకతాటిపైకి వచ్చి ప్రజల మధ్య దూరం పెంచే కుట్రదారుల చర్యలను నిరసించాలి’ అంటూ పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు.