గుంటూరు : రాజధాని ప్రాంత రైతులకు, ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రభుత్వానికి గట్టిగా వార్నింగిచ్చాడు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి ఉంటే విచారించి చర్యలు తీసుకోవాలి తప్ప.. అక్రమాల పేరు చెప్పి రైతుల పొట్ట కొట్టడం మంచిది కాదని బుద్దిచెప్పారు. అవినీతి ఉందని తేలితే చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘జగన్‌రెడ్డి వైసీపీ అధినేతగా పాలన సాగిస్తున్నారు తప్ప.. ఒక సీఎంగా భావించడం లేద’ని అన్నారు. ఈ ప్రాంత రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు తప్ప టీడీపీకి కాదనేది తెలుసుకుంటే మంచిదన్నారు.
ఈ విషయాన్నిజగన్ రెడ్డి గుర్తుంచుకుని రాజధాని ఇక్కడే ఉండేలా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఎంత దూరమైనా పోరాటం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే.. రాజధాని విషయంలో ప్రధాని మోడీ, అమిత్ షాలను కలుస్తానని చెప్పారు. పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించారు. నిడమర్రు, కూరగల్లులో పర్యటించిన ఆయన కొండవీటి వాగు దగ్గర వంతెన పనుల్నిపరిశీలించారు.ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ ఇంకా ఏమన్నారంటే…
అభివృద్ధి వికేంద్రీకరణకు మేం వ్యతిరేకం కాదు..
అలా అని ఇష్టానుసారంగా చేస్తామంటే ఊరుకోము..
మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితులను అర్థం చేసుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది..
అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు జగన్ కూడా అంగీకరించారు..
రాజధాని రైతుల్లో నెలకొన్న ఆందోళనపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలి..
తిరుగులేని విజయాన్ని అప్పగించిన జగన్‌రెడ్డి ఇంకా ఎందుకో ఆందోళన చెందుతున్నారు..
వంద రోజుల వరకు మాట్లాడకూడదు అని మేం భావించినా ప్రభుత్వం మేము మాట్లాడేలా చేసింది..
రాజధాని రైతులు భూములిచ్చేసి.. పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు..
90 రోజుల జగన్ పాలనలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది..
మంచి చేస్తారని సీఎంను చేస్తే ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు..
రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది..
గతంలో భూసేకరణను మేంమే వ్యతిరేకించాం..
ఇప్పుడు రాజధాని మార్పును కూడా వ్యతిరేకిస్తున్నాం..
రైతులకు జనసేన అండగా ఉంటుంది..