వైసీపీ హయాంలో రాష్ట్రంలో రౌడీల పాలన నడుస్తోందని తీవ్రంగా మండిపడ్డారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఆదివారం ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత బాధితలకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పవన్ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలకు సంస్కారం, మంచి, మర్యాద పని చేయవని.. వాళ్లు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని పవన్ ఆరోపణలు చేశారు.
ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత వెనుక సజ్జల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. సజ్జల ఢీఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటం ప్రజలపై సజ్జల కక్షసాధింపు చర్యలకు దిగారని దుయ్యబట్టారు పవన్.
ఇళ్ల కూల్చివేతలో నష్టపోయిన బాధితులకు పరిహారం కూడా ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని వ్యాఖ్యానించారు. ఇప్పటం ప్రజల ఇళ్ల కూల్చివేత తనను బాధించిందని, అందుకే వారికి అండగా ఉండేందుకు గ్రామానికి వచ్చానని తెలిపారు పవన్.
2024లో తాము అధికారంలోకి వస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే వైసీపీ నాయకులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చట్టపరంగానే వైసీపీ నాయకుల ఇళ్లు కూలగొడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.