కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆదివారం జరిగిన ఘటనలో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్ పరామర్శించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ద్వారంపూడిని ఉద్దేశించి ఎమ్మెల్యేగా కొనసాగుతూ అసభ్యకరమైన వ్యాఖ్యలను చేస్తారా అంటూ ప్రశ్నించారు. మీరే విమర్శలు చేసి, మీరే దాడులు చేసి.. తిరిగి మీరే కేసులు పెడుతారా అంటూ మండిపడ్డారు. పండగ సమయంలో లేని గొడవలను సృష్టించారని వ్యాఖ్యానించారు. పచ్చి బూతులు తిట్టారని.. కారణం లేకుండా దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వారంపూడి వ్యాఖ్యలు క్షమించరానివని… మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృత్తమైతే ఊరుకోబోమని హెచ్చరించారు. జనసేన కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు భాద్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు పవన్. జనసేనాని పర్యటన నేపథ్యంలో పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో 144సెక్షన్ అమలు చేశారు.