– రహదారులపై జనసేన వార్
– కొత్త హ్యాష్ ట్యాగ్ తో 3 రోజుల ప్రచారం
ఏపీలో రోడ్ల పంచాయితీ నిత్యం జరుగుతుండేదే. రహదారుల విషయంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తుంటాయి. ఆఖరికి తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం అక్కడి రోడ్లపై సెటైరికల్ గా మాట్లాడారు. అయితే.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ మరో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జనసేన. #GoodMorningCMSir హ్యష్ ట్యాగ్ తో డిజిటల్ ప్రచారానికి దిగింది.
ఈ నెల 15, 16, 17 తేదీలలో రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై ఫోటోలు, వీడియోలతో ప్రభుత్వాన్ని నిలదీయనుంది. రోడ్లకు కనీస మరమ్మతులు కూడా కావడం లేదని.. గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రిని నిద్ర లేపేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని చెబుతోంది. గ్రామాలు, మండలాల్లో రహదారుల దుస్థితిని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అంటోంది జనసేన.
ఈ డిజిటల్ క్యాంపెయిన్ లో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నారు. గతంలోనూ ఏపీలోని రోడ్లపై ఇలాంటి ప్రచారమే నిర్వహించింది జనసేన. వర్షాకాలంలో రోడ్ల మరమ్మతులు ఏంటని వైసీపీ ప్రశ్నించినా.. అప్పటిదాకా ఏం చేశారనే విమర్శలు వచ్చాయి. పోనీ తర్వాత ఏమన్నా చేశారా? అంటే అదీ లేదని.. అందుకే మరోసారి ఈ నిరసన ప్రచారం నిర్వహిస్తున్నట్లు వివరిస్తోంది జనసేన.
మరోవైపు అమరావతి నుంచి లింగాపురం వెళ్లే రోడ్డు బాగా దెబ్బతింది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అటుగా వెళ్తుండగా.. స్థానికులు, యువకులు రోడ్డు ఎంత దారుణంగా ఉందో చూడమని కోరారు. కారులో నుంచి దిగి గుంతలు పడిన రోడ్డు, అందులో నీళ్లను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని.. జనసేన డిజిటల్ ప్రచారంతో సీఎంని నిద్ర లేపుదామని పిలుపునిచ్చారు మనోహర్.
అమరావతి నుంచి లింగాపురం వెళ్లే చిద్రమైపోయిన రోడ్డును శ్రీ మనోహర్ గారు, పార్టీ నేతలు పరిశీలించారు. https://t.co/a0ZpLGl7up pic.twitter.com/wKhUdDIHv4
— JanaSena Party (@JanaSenaParty) July 12, 2022
Advertisements