ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్ లో విలీనం వరకు ఫుల్ యాక్టివ్ గా ఉన్న చిరంజీవి… 2014 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పైగా సినిమాల్లోనూ యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో తన రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనని అంతా భావిస్తున్న తరుణంలో జనసేన నేత నాదేండ్ల మనోహార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ మళ్లీ సినిమాలు చేస్తున్నది చిరంజీవి సలహాతోనేనన్న నాదేండ్ల… పవన్ కళ్యాణ్ వెంటే చిరంజీవి ఉండబోతున్నారని ప్రకటించారు. చిరంజీవి నైతిక మద్దతు ఇప్పటికే పవన్ కు ఉందని, పవన్ కు అండగా ఉంటానని చిరంజీవి హామీ ఇచ్చారన్నారు. దీంతో చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై మరోసారి చర్చ ప్రారంభం అయ్యింది.
నాదేండ్ల ప్రకటనతో గతంలో చిరంజీవి వెంట నడిచిన ప్రజారాజ్యం, కాంగ్రెస్ నేతలు… ఇప్పుడు చిరంజీవితో పాటే జనసేనతో నడుస్తారా…? ఇంతకు నాదేండ్ల వ్యాఖ్యల్లో నిజమెంత అన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి.
ప్రజారాజ్యం పార్టీతో తిరుపతి అసెంబ్లీ నుండి గెలిచిన చిరంజీవి… తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ లో విలీనం అయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా చిరంజీవి బాధ్యతలు నిర్వహించారు. కానీ 2014 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.