జనసేన పార్టీ సభ్యుడు కొణిదెల నాగబాబు ఆదివారం అనంతపురంలో పర్యటిస్తున్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదురుగా పాడైపోయిన తాడిపత్రి రహదారిని పరిశీలించారు. ధ్వంసమైన చెరువు కట్ట రోడ్డులో శ్రమదానం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్డు మరమ్మత్తు శ్రమదానం కోసం నాగబాబు పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వ అధికారులు శుక్రవారం నుంచి హడావిడిగా ధ్వంసమైన చెరువు కట్ట రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు.
ఈ సందర్భంగా నాగబాబు మీడియాతో మాట్లాడుతూ.. జనసైనికులు రోడ్డు వేస్తారని భయంతో.. వైసీపీ ప్రభుత్వం వెంటనే పనులు మొదలు పెట్టిందని ఎద్దేవా చేశారు. రోడ్లు ఎలా ఉన్నాయో.. రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉందని విమర్శించారు.
సభలు, సమావేశాలు జరగకుండా ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 1పై హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసులు ఇబ్బందులు పెట్టినంత మాత్రాన తమ కార్యక్రమాలు ఆగవని నాగబాబు స్పష్టం చేశారు.
డెమోక్రసీ లో ఇల్లీగల్, చట్ట వ్యతిరేక పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఎవరైనా.. ఎప్పుడైనా చేయవచ్చన్నారు. పోత్తుల గురించి మాట్లాడే సమయం ఇప్పుడు కాదన్నారు. వారాహి యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభిస్తారో.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని తెలిపారు. అలాగే రాబోయే ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి పవన్ కళ్యాణ్ తీసుకోబోయే నిర్ణయం గురించి తామంతా ఎదురు చూస్తున్నామన్నారు.
పొత్తుల గురించి, సీట్ల షేరింగ్ గురించి పవన్ ప్రకటిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని అరాచక పాలనను అంతమొందించడానికి ఇతర పార్టీలతో పొత్తులు అవసరమని చెప్పారు. సినీ పరిశ్రమలో ఉన్న ఏ ఒక్క వ్యక్తిని కూడా ఒక్క మాట అనని వ్యక్తులు కేవలం రాజకీయ లబ్ధి కోసం తమ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ పరోక్షంగా మంత్రి రోజాపై విమర్శలు గుప్పించారు నాగబాబు.