జనసేన పార్టీతో ఆంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే రాపాక ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం హాజరు అయిన… ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాపాక మాత్రం సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశమైంది. పార్టీ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే గుడివాడలో ఎడ్ల పందాలలో పాల్గొనడం గమనార్హం. రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరుతారని కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. ఇటీవల కాలంలో సీఎం జగన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలను జనసేన వ్యతిరేకిస్తోండగా… రాపాక మాత్రం స్వాగతిస్తున్నారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించగా రాపాక సమర్ధించారు. మంచి నిర్ణయమని ప్రశంసించారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు కూడా ఆయన మద్దతునిచ్చారు.