జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక మరోసారి షాక్ ఇచ్చారు. మూడు రాజధానులపై సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందరు ముఖ్యమంత్రులు హైదరాబాద్ అభివృద్ధిపైనే దృష్టి సారించడం వలన ఏపీ అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయని.. ఏపీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ కార్యక్రమానికైనా తమ పార్టీ మద్దతునిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం రైతుల నుంచి అక్రమంగా భూములను లాక్కుందని… రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరగకుండా రాజధాని తరలింపు ఉండాలని కోరుకుంటునామ్మన్నారు ఎమ్మెల్యే రాపాక. ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత రాపాక ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే రాజధాని తరలింపు విషయంలో పార్టీలో మరోసారి భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజధాని తరలింపు అడ్డుకోవాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత రైతులతో ఆందోళనకు శ్రీకారం చుట్టారు. కాగా ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే మాత్రం జగన్ నిర్ణయానికి జై కొట్టడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Advertisements