నాదెండ్ల మనోహర్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్
రాష్ట్రంలో పాలకులు మారినా ప్రజల బతుకులు మారలేదు. ఖనిజ సంపద దోపిడీ ఆగలేదు. వంతాడలో లేటరైట్ తవ్వకాల పేరుతో విలువైన బాక్సైట్ ను లక్షల టన్నుల మేర తరలిస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2018లోనే చెప్పారు. ఇప్పుడు కూడా అదే రీతిలో బాక్సైట్ దోపిడీ కొనసాగుతోంది. వంతాడలో మైనింగ్ కు ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నారో.. ఇప్పుడు భమిడికలొద్దిలోనూ అలాగే అక్రమాలకు తెరతీశారు. వంతాడలో ఆండ్రూ కంపెనీ 34 లక్షల మెట్రిక్ టన్నుల బాక్సైట్ తవ్వకాలకు పాల్పడిందని చెప్పిన గనుల శాఖ అధికారులు… కొద్దిదూరంలోనే ఉన్న భమిడికలొద్ది తవ్వకాల గురించి ఎందుకు మాట్లాడడం లేదు.
అక్రమంగా తవ్వేసిన విలువైన ఖనిజాన్ని తరలించేందుకు అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ నిధులతో రోడ్డు వేసిన మాట నిజం కాదా..? ఆ రోడ్డు కోసం పర్యావరణ విధ్వంసానికి పాల్పడలేదా..? వంతాడలో యథేచ్ఛగా చేసిన మైనింగ్ వల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు దెబ్బతిన్నాయి. అక్కడి ప్రజల జీవితాలు కష్టాల పాలయ్యాయి. ఇప్పుడు భమిడికలొద్ది ప్రాంత గిరిజనుల పరిస్థితి కూడా అలాగే ఉంది. వంతాడతోపాటు భమిడికలొద్ది మైనింగ్ పై తక్షణమే విచారణ చేపట్టి అక్కడ ఉన్నది లేటరైటా..? బాక్సైటా అనేది తేల్చాలి. అధికార పక్షం మాటనే గనుల శాఖ అధికారులు వినిపిస్తే కచ్చితంగా గ్రీన్ ట్రైబ్యునల్, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం.