ఏపీలో పొత్తుల పై జనసేన కీలక ప్రకటన చేసింది. జనసేన ఎవరితో పొత్తుతో ఎన్నికలకు వెళ్తుందనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చకు కారణమైంది. ఈ అంశం పైన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. దాదాపుగా పొత్తుల అంశం పైన స్పష్టత ఇచ్చారు.
ఏపీలో టీడీపీ -జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న సమయంలో ప్రధాని టూర్ మొత్తం సమీకరణాలనే మార్చేసింది. ఆ తరువాత టీడీపీ – జనసేన పొత్తు ఉంటుందా ..ఉండదా అనే చర్చ మొదలైంది. ఈ డైలమా నడుమ నాదెండ్ల మనోహర్ పొత్తులపైన చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరిని స్పష్టం చేసాయి.
జనసేన ఎవరితో పొత్తుతో ముందుకెళ్తుందనే దాని పైన నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. జనసేన పారదర్శక రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఏ పార్టీతోనైనా పొత్తు ఉంటే ధైర్యంగా చెప్పే దమ్ము పవన్ కల్యాణ్ కు ఉందని మనోహర్ వివరించారు. కొన్ని పార్టీలు కావాలనే విష ప్రచారం చేస్తున్నాయని మనోహర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఎదుగుతోందని వివరించారు. దీంతో, రెండు పార్టీలకు భయం పట్టుందని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర పైన వైసీపీ నేతలు కపట ప్రేమను ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో సాగు-తాగు నీటి సమస్యలను పరిష్కరిస్తామని మనోహర్ హామీ ఇచ్చారు.
ఇప్పుడు మనోహర్ తమ పార్టీ బలం పెంచుకోవటం పైన రెండు పార్టీలకు భయం పట్టుకుందంటూ పరోక్షంగా వైసీపీ – టీడీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా స్పష్టం అవుతున్నాయి. వైసీపీతో పోరాటం చేస్తున్న జనసేన..అదే సమయంలో టీడీపీతో పొత్తు అంశాన్ని దాదాపుగా పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది.