పొత్తుల విషయంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలురైతు భరోసా యాత్ర నిర్వహించారు. చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలను కలిసి భరోసానిచ్చారు. ఒక్కో కుటుంబానికి జనసేన తరఫున లక్ష రూపాయల సాయం అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్.. టీడీపీతో పొత్తు అవకాశాలపై ప్రశ్నించగా కీలక కామెంట్స్ చేశారు. పొత్తులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు.
తనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజల అభివృద్ధే ముఖ్యమని చెప్పారు పవన్. ప్రభుత్వ పాలన తీరుతోనే తాను గతంలో వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చబోమని వ్యాఖ్యానించానని తెలిపారు. వ్యతిరేక ఓటు చీలి మరోసారి ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందన్నారు. ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నయ ప్రభుత్వం రావాలని.. జనసేనతో ఎవరెవరు కలిసి వస్తారో తనకు తెలియదని చెప్పారు. ఎన్నికలకు చాలా సమయం ఉందని పొత్తులపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీతో తమ భాగస్వామ్యం అమోఘమైన రీతిలో ఉందని తెలిపారు పవన్. రోడ్ మ్యాప్ కు సంబంధించిన విషయాలను తగిన సమయంలో వెల్లడిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చే దిశగా తాము బలంగా అడుగులు వేస్తున్నామని.. తాము వైసీపీకి వ్యతిరేకం కాదనే విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఎంతో హుందాగా రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించవచ్చని.. కానీ వారు సంఖ్యాబలం ఉందని దౌర్జన్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మొన్నే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్ని పక్షాలు కలిసి రావాలని.. అవసరమైతే త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇంట్రస్టింగ్ మారాయి. మరోవైపు ఈ టూర్ లో పవన్ చేతికున్న రెండు ఉంగరాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అవి జెమ్ స్టోన్స్ పొదిగిన ఉంగరాలు కావడంతో.. ఏదైనా జ్యోతిష్యానికి సంబంధించినవి అయి ఉండొచ్చని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.