ముందు కమ్యూనిస్టు అనుకున్నారు. తర్వాత హేతువాది అనుకున్నారు. ఆ తర్వాత మానవతావాది అనుకున్నారు. ఇంకొన్నాళ్లు పోయాక.. ఫిలాసఫర్ లా అనిపించారు. ఆ తర్వాత గుళ్లు, గోపురాలు తిరగడం మొదలెట్టారు. దీంతో .. అల్ట్రా మోడ్రన్ కమ్యూనిస్టు అనుకున్నారు. ఇప్పుడు టైమ్ గిరగిరా తిరిగిపోయాక.. ఆయన భావజాలం కూడా తిరిగినట్లే అనిపిస్తోంది. ఇప్పుడు బిజెపితో చేరాక.. అచ్చు బిజెపివారిలానే ఓ హిందూత్వ వాదిలా మాట్లాడుతున్నారు. అలా కమ్యూనిజం నుంచి హిందూయిజం దాకా పవన్ కల్యాణ్ ఎదిగారని అనాలా.. లేక దిగజారారని అనాలా.. లేక కాలానికనుగుణంగా..పరిస్ధితులకనుగుణంగా తన అవతారాలు మారుస్తూ వస్తున్నారనాలా.. ఏమో జనం, ఆయన ఫ్యాన్స్ మాత్రమే డిసైడ్ చేయాలి. అనటానిక మనమెవరం.
అసలే చీకటి.. దారంతా గుంతలు.. చేతిలో లాంతరు.. అంటూ ఒక రేంజ్ లో ఎంట్రీ ఇచ్చారు పాలిటిక్స్ లోకి పవన్ కల్యాణ్. ఎవరో వరంగల్ వ్యక్తి రాసిన పుస్తకాన్ని చూపించారు. ఆ తర్వాత కమ్యూనిజం కొటేషన్లు కొన్ని వినిపించారు. పవన్ కల్యాణ్ కమ్యూనిస్టు అని.. ప్రజల మనిషి అనే ప్రచారం బాగా జరిగింది. కాని వెంటనే బిజెపి, టీడీపీలతో పొత్తు పెట్టుకోగానే.. అనుమానం వచ్చినా.. రాజకీయ ఎదుగుదల కోసం.. వారిని కలిశాడు తప్ప.. ఆయన సిద్ధాంతం ఆయనదే అని సరిపెట్టుకున్నారు.
ఆ తర్వాత అప్పుడప్పుడు కనపడటమే తప్ప యాక్టివ్ పాలిటిక్స్ చేయలేదు. ఉద్దానం కిడ్నీ సమస్య, చేనేత కార్మికుల సమస్యలు… రాయలసీమ రైతుల సమస్యలపై చర్చలు.. మీటింగులు పెడితే.. ఆయనలో మానవతావాది కనిపించారు. మేధావులు, కొంతమంది మాజీ కమ్యూనిస్టులు ఆయన దగ్గరకు వెళ్లి.. అవసరమైనంత డేటాను, పుస్తకాలను అందించారు. తర్వాత కాలంలో ప్రత్యేక హోదా విషయంలో బిజెపిని తిట్టడం.. ఆ తర్వాత అవినీతి విషయంలో టీడీపీని తిట్టడంతో… ఆయన కమ్యూనిస్టులకు దగ్గరయ్యారు. కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుండగానే.. వెరైటీగా బీఎస్పీతో పొత్తు పెట్టుకుని సామాజిక న్యాయ నినాదం వినిపించారు. అయినా ఎన్నికల ఎత్తుగడగా ఊరుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయారు.
ఇక బిజెపితో డైరెక్టు ఫ్రెండ్ షిప్ కు వెళ్లిపోయారు. కమ్యూనిస్టులను పక్కన పెట్టేశారు. వారికి బలం లేదు.. వారితో పని లేదన్నట్లే వ్యవహారం చేశారు. దీంతో వామపక్ష నాయకులు అవాక్కయ్యారు. అయినా ఆయన కూడా నటుడే కదాని తర్వాత సర్దుకున్నారు. ఇక బిజెపితో స్నేహం కలిశాక.. మతమార్పిడులపై మొదటిసారి గళమెత్తి.. కమలం ఫ్లేవర్ చూపించారు. ఆ తర్వాత దేవాలయాలపై దాడులు.. క్రిస్టియానిటీకి ప్రోత్సాహం మీద.. విమర్శలు కూడా చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా.. హిందువుల మనోభావాలు.. హిందూత్వ భావజాలం.. భక్తుల మనోభావాలు .. అంటూ అసలు సిసలు హిందూత్వవాదిలా ప్రవచనాలు చెప్పేస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
అయ్యారే.. మన పవన్ కల్యాణ్.. ఎలా రూపాంతరం చెందాడు.. కొత్త అవతారంలోకి ఎంత త్వరగా మారిపోయాడు అనుకుంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరి బిజెపి-జనసేన ముఖ్యమంత్రి అభ్యర్ధి కావాలంటే.. ఆ మాత్రం.. ట్యూన్ కాకపోతే ఎలా మరి.. అంటూ వారే ఎదురు ప్రశ్నిస్తున్నారు.