నా ఆఖరి శ్వాస వరకూ రాజకీయాలను వదలనని వెల్లడించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి సభకి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిరికితనం అంటే నాకు చిరాకు.. యువత కోసం, రాష్ట్రం కోసం అవసరం అయితే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. నా దగ్గర శ్వాస ఉన్నంతవరకూ రాజకీయాలను వదలను, మిమ్మల్ని కూడా వదలనన్నారు. అసలు పూర్తిస్థాయి నాయకులంటే ఎవరు? అని ప్రశ్నించారు. నేను సినిమాలు చేయాలి.. నాకు వేరే దారి లేదన్నారు. నాకు డబ్బు అవసరం లేని రోజు వస్తే సినిమాలు వదిలేస్తానన్నారు.
రైతులకు గిట్టుబాటు ధరలేదు.. నిరుద్యోగులకు ఉద్యోగం లేదు.. ఉద్యోగులకు జీతం రావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంబరాల రాంబాబు పిచ్చికూతలు ఆపేసి పని చేయాలంటూ అంబటి రాంబాబుపై సెటైర్లు వేశారు. నన్ను వ్యక్తిగతంగా విమర్శించే వారందరి జీవితాలు నాకు తెలుసన్నారు. వారితో పోలిస్తే నేను దేవుడినని చెప్పుకోవాలంటూ పవన్ సెటైర్లు వేశారు. మూడు ముక్కల ముఖ్యమంత్రి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆయన ఫ్రెండ్స్ కొంతమంది నాకు తెలుసు. ఆయన ఎలాంటి వాడో తెలుసు. ఉత్తరాంధ్రను గంజాయి హబ్‌గా చేశారు. అరకులో దొరికే గంజాయి మంచి క్వాలిటీ అంట. అది తాగితే మంచి మత్తు వచ్చి ఏది పడితే అది మాట్లాడచ్చు అని అనుకుంటారు సంబరాల రాంబాబు.
అలాగే పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇచ్చి సాయంత్రం సారాతో పట్టుకుపోతున్నారని విమర్శించారు. మంచి వ్యక్తిత్వం ఉన్నవారిని గౌరవిస్తాను. కానీ జైలులో ఉన్నావారిని కాదన్నారు. మేము అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రని అభివృద్ధి చేసి.. వలసలు ఆపుతానన్నారు. మత్స్యకారులకు జెట్టీలు నిర్మిస్తానన్నారు. అవసరమైతే ప్రజల కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమన్నారు పవన్.
నేను చూడని డబ్బా? చూడని అభిమానమా? అయినా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను? ప్రజల సమస్యలు తీర్చడానికి వచ్చాను. మీ తరపున పోరాడటానికి వచ్చానన్నారు. నేను పోరాటయాత్ర మొదలుపెట్టినప్పుడు పార్టీ అకౌంట్‌లో 13లక్షలు మాత్రమే ఉన్నాయన్నారు. అయినా సరే యాత్రను మొదలుపెట్టాను. అంబేద్కర్ భవన్ లో, కళ్యాణమండపాల్లో ఉంటూ.. యాత్ర సాగించామని తెలిపారు పవన్ కళ్యాణ్.