తెలంగాణ బీజేపీ నాయకత్వం తీరుపై నిప్పులు చెరిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ బీజేపీతోనూ ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు తక్కువగానే ఉన్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల తర్వాత ఆయన.. కచ్చితంగా మనసు మార్చుకుంటారేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జనసేన 18 వార్డుల్లో విజయం సాధిస్తే..బీజేపీ కేవలం 7 వార్డుల్లో గెలుపుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇందులో కూడా జనసేన తమకు ముందునుంచే బలం ఉన్న స్థానాల్లో జెండా ఎగరవేసింది. అంటే ఇతర చోట్ల బీజేపీతో పొత్తు తమకు పెద్దగా లాభించలేదన్న విశ్లేషణలు జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో కమలం పార్టీతో తమకు కలిగిన ప్రయోజనం శూన్యమేనన్న అభిప్రాయం జనసైనికులు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఏపీలో ప్రస్తుతం బీజేపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నప్పటికీ.. నిర్ణయాధికారం కమలం నేతల చేతుల్లోనే ఎక్కువగా ఉంది. ఏ అంశంలోనైనా పవన్ జస్ట్ గెస్ట్ రోల్ చేయాల్సి వస్తోంది. పైగా ఆ పార్టీతో పొత్తు కారణంగా రాష్ట్రానికి నష్టం చేసే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వంటి నిర్ణయాలకు పరోక్షంగా మద్దతివ్వాల్సి వస్తోంది. ఫలితంగా కేంద్రాన్ని సపోర్ట్ చేస్తున్న అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఇక దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు అంశాల్లో కూడా భాగస్వామ్య పార్టీగా జనసేన డిఫెన్స్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి జనసేనతో అవసరం ఉందేకానీ.. జనసేనకు బీజేపీ అవసరం లేదన్న అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. దీంతో ఈ బంధం ముందు ముందు బలపడే అవకాశాల కంటే.. బలహీనపడే సంకేతాలు ఎక్కువగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.