మూడు నెలల్లో మంత్రి పదవి పోతుందన్న భయంతో వెల్లంపల్లి శ్రీనివాస్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. అసలు.. వెల్లంపల్లి చరిత్ర విజయవాడలో ఎవరిని అడిగినా చెబుతారని.. తాడేపల్లి ప్యాలెస్ లో ఆయనకు ఎంట్రీ లేదని విమర్శించారు. దేవుడి ఆస్తులు కబ్జా చేస్తూ.. పవన్ ను తిడతారా అంటూ మండిపడ్డారు.
వెల్లంపల్లి సినిమా తీస్తే కామెడీ బాగా పండుతుందని సెటైర్లు వేశారు పోతిన మహేష్. ఆ మూవీకి మూడు టైటిల్స్ ను కూడా సూచించారు. మూడు కొబ్బరి చిప్పలు.. ఆరు కబ్జాలు, బందర్ రోడ్డులో భూం భూం, వన్ టౌన్ వెస్ట్ లో వేస్ట్ ఫెలో అనే పేర్లతో వెల్లంపల్లి సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల సమయంలో ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ ని బతిమలాడుకున్న చరిత్ర మర్చిపోయావా అని నిలదీశారు.
150కి పైగా ఆలయాలపై దాడులు జరిగితే.. ఒక్క ఘటనలోనైనా విచారణ పూర్తి చేయించలేని చేతగాని మంత్రి అంటూ విమర్శించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు మహేష్. జగన్ అరాచక పాలనను చూడలేకే ఆయన తల్లి తెలంగాణకు వెళ్లిపోయారని అన్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.. పన్నులు విధిస్తున్నారు.. పెట్టుబడిదారులు పారిపోతున్నారు.. నిరుద్యోగులు పెరిగిపోతున్నారు.. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వాన్ని తిట్టడానికి కూడా మాటలు చాలడం లేదని మండిపడ్డారు పోతిన మహేష్.