జనసేన పదో ఆవిర్భావ సభకు రెడీఅవుతోంది. ఈ వేడుకను మచిలీపట్నంలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ పార్టీ ముఖ్యనాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. 34 ఎకరాల స్థలాన్ని పరిశీలించామని,తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామనన్నారు.ఈ వేదికకు పొట్టి శ్రీరాములు వేదికగా నామకరణం చేశామని తెలిపారు నాదెండ్ల.
త్వరలోనే ఈ సభకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా, ప్రజల పక్షాన నిలిచేలా జనసేన కార్యక్రమాలు నిర్వహించిందని మనోహర్ వ్యాఖ్యానించారు.
పవన్‌ను వ్యక్తిగతంగా అవహేళన చేసినా ప్రజల కోసం నిలబడ్డారని ఆయన గుర్తుచేశారు. జనసేన నాయకులు, వీర మహిళలు తమ అధినేతకు అండగా నిలిచారని..ఏ పిలుపు ఇచ్చినా స్పందించారని హర్షం వ్యక్తం చేశారు.
భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు కోసం, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజల్ని కంకణబద్దుల్ని చేసే వేదిక ఈ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. సభా వేదికపై రైతుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరిట సభా వేదికను ఏర్పాటు చేస్తామని, జాతి గర్వించే మహానుభావుడు పింగళి వెంకయ్య గారు, స్వతంత్ర సమర సాయుధ పోరాట యోధుడు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ల త్యాగాలను స్మరించుకునే విధంగా సభ ప్రాంగణం ఉంటుందని తెలిపారు.
మార్చి 14వ తేదీన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహిలో బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకుంటారని ఈ సందర్బంగా నాదెండ్ల ప్రకటించారు.
రాబోయే పది రోజుల్లో సభ కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వైసీపీకి వ్యతిరేకంగా పాల్గొనాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారన్నారు.
వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపే విధంగా జనసేన ప్రణాళిక ఉంటుందన్నారు. ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడుతున్న పవన్ ను ఆదరించండి అంటూ పిలుపునిచ్చారు. వైసిపి విముక్త ప్రభుత్వాన్ని తీసుకు రావాలన్నారు.