– జనసేన జనవాణి వాయిదా
– కానీ, పంతం నెగ్గించుకున్న పవన్
– చనిపోయిన జనసైనికుల కుటుంబాలకు చెక్కులు
– నోటీసులు ఇచ్చిన పోలీసులు
– వైసీపీ సర్కార్ పై జనసేనాని ఆగ్రహం
– తాటాకు చప్పుళ్లకు భయపడనన్న పవన్
– చంద్రబాబు, సోము వీర్రాజు మద్దతు
– వరుసగా మంత్రుల కౌంటర్ ఎటాక్
‘‘ఉడతా ఉడతా ఊచ్.. ఎక్కడ కెళ్తోవోచ్.. రుషికొండ మీద జాంపండు కోసుకొస్తావా.. మా వైసీపీకి ఇస్తావా.. మా థానోస్ గూట్లో పెడతావా..! జనసేన చేపట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో వైసీపీపై పవన్ కళ్యాణ్ వేసిన వ్యంగ్యాస్త్రం ఇది. జనవాణి కార్యక్రమం కోసం శనివారం విశాఖకు వెళ్లారు పవన్. ఎయిర్ పోర్టు నుంచి భారీ ర్యాలీతో నోవాటల్ కు చేరుకున్నారు. అయితే.. అడుగడుగునా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారని జనసేన నేతలు మండిపడుతున్నారు.
ఇంకోవైపు వైసీపీ నేతలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేయడంతో.. అది జనసేన నేతల పనే అని పలువుర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేసింది జనసేన. కానీ, చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బాసటగా నిలిచారు పవన్. హోటల్ దగ్గరకే వారిని పిలిపించుకుని చెక్కులు పంపిణీ చేశారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి మీటింగులకు అనుమతి లేదన్నారు. అసలు.. మీటింగ్ అంటే ఏంటి మీ దృష్టిలో అని పోలీసులు నిలదీయగా.. వారు సరైన సమాధానం చెప్పలేకపోయారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ వైసీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశామని 5 నెలల క్రితమే తమ కార్యక్రమం నిర్ణయం చేశామన్నారు. విశాఖ గర్జనకు పోటీగా తాము ఈ కార్యక్రమం పెట్టలేదని స్పష్టం చేశారు. జనవాణి జనం గొంతుక అన్న ఆయన.. సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తే జనం తమ దగ్గరకు ఎందుకు వస్తారని అడిగారు. మూడు వేలకు పైగా పిటిషన్లు ఎందుకు ఇస్తారన్నారు. పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి కొమ్ముకాయడం తనకు బాధేస్తోందని చెప్పారు.గంజాయి వ్యాపారం చేసే వారిని, దోపిడీలు చేసేవారిని వదిలేస్తారు. ప్రజల సమస్యలు గొంతెత్తితే నొక్కేస్తారా? అని అనిలదీశారు.
తాను మూడు సార్లు పెళ్లి చేసుకున్నానని మూడు రాజధానులు పెట్టాలా? మీరూ కూడా విడాకులిచ్చి.. చేసుకోండని వైసీపీ నేతలకు చురకలంటించారు. కడుపు కాలినవాడు గర్జిస్తాడని.. మీరు చేసిన గర్జన ఏంటో అందరికీ తెలిసిందని విమర్శించారు. సంబంధం లేని వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారన్న పవన్.. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు. 2014లోనే విశాఖ, కర్నూలు, అమరావతి రాజధాని అని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం వల్ల అనేక పరిశ్రమలు వెళ్లిపోయాయని.. వాటాలు లేవని ఇలా చేస్తారా? ఒక వ్యక్తి చేతుల్లో అధికారం ఉంచుకొని మీరు వికేంద్రీకరణ గురించి మాట్లాడతారా? అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. వైసీపీ గూండాలకు ఒక్కటే చెబుతున్నానన్న పవన్.. మీ ఉడత ఊపులకు భయపడనని స్పష్టం చేశారు. మరోవైపు వైసీపీ నేతలు పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ నడుస్తున్నారని ఆరోపించారు.