జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘యువశక్తి సభ’ శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద ఉదయం 11 గంటలకు జరుగనుంది. ఇప్పటికే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం కు చేరుకున్నారు. ఈ యువశక్తి వేదికకు ‘వివేకానంద వికాస వేదిక’గా నామకరణం చేశారు పార్టీ నేతలు. ఈ సభ కోసం 30 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సభ జరగనుంది.
మధ్యాహ్నం సభ వేదిక వద్దకు చేరుకోనున్న పవన్, యువతతో మాట్లాడాక ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, నాగబాబు ,అలాగే పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, యువత ఈ సభకు హాజరుకానున్నారు.కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర యువతను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో పెట్టుకొని రెండు తీర్మానాలు చేయనుంది పార్టీ. జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ఈ సభ ద్వారా తెలియజేస్తాం. మా పాలసీని వివరిస్తాం.
రాష్ట్రంలో అభివృద్ధి ఎందుకు కుంటూ పడిందో .. పార్టీ అధిష్టానం యువతకు సందేశాలివ్వబోతుంది. రాజకీయాల్లో మార్పు కోసం జనసేన ప్రయత్నం చేస్తుందని అందుకే యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉత్తరాంధ్ర సమస్యలు, వనరులు, స్థానిక నాయకత్వ వైఫల్యంపై చర్చిస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉపాధి కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకార యువతలో యువశక్తి భరోసా నింపుతుందన్నారు.
బహిరంగ సభకి విచ్చేసే యువతకి పార్టీ నాయకులు, కార్యకర్తలకి కూడా ఎక్కడ ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారికి స్పష్టంగా తెలియజేసారు. మరోవైపు ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్త్ ఏర్పాటు చేసారు.ఈ సభకు సుమారు 1.50 లక్షల మంది వస్తారని అంచనా.
మరి జీవో 1 అమలు లో ఉన్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారో చూడాలి.