ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం అన్ని ప్యాసింజర్ రైళ్లకు షట్డౌన్ చేయనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.ఇందులో భాగంగా మార్చి 21 న 22:00 గంటల నుండి మార్చి 22 న 24:00 గంటల వరకు అన్ని రైళ్లను నిలిపివేస్తామని భారతీయ రైల్వే ప్రకటన విడుదల చేసింది. అయితే అప్పటికే ఉదయం 7:00 గంటలకు నడుస్తున్న ప్యాసింజర్ రైళ్లను మాత్రం గమ్యస్థానాలకు వెళ్ళడానికి జనతా కర్ఫ్యూ రోజున అనుమతిస్తారు. మెయిల్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సేవలను నిలిపివేస్తాయని, భారతీయ రైల్వే పేర్కొంది. కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, జనతా కర్ఫ్యూ కారణంగా డిమాండ్ తక్కువగా ఉంటుందని కూడా రైల్వే చెబుతోంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై మరియు సికింద్రాబాద్‌లలోని సబర్బన్ సేవలను కనీస స్థాయికి తగ్గించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
ఇప్పటికే నడుస్తున్న రైళ్ల ద్వారా ప్రయాణించే ప్రయాణీకులు, స్టేషన్‌లో ఉండటానికి ఇష్టపడేవారు రద్దీగా ఉండే పరిస్థితులను సృష్టించకుండా వెయిటింగ్ హాల్స్, వెయిటింగ్ రూములు లలో ఉండాలని అధికారులు ఆదేశించారు. వీరికి తాగునీరు, చెల్లింపుపై సదుపాయాలను ఏర్పాటు చేశారు. రైలు రద్దు వల్ల ప్రభావితమైన ప్రయాణీకులకు ముందుగా బుకింగ్ చేసుకున్న టిక్కెట్ల డబ్బు వాపసు ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఇప్పటికే భారత రైల్వే 245 రైళ్లను రద్దు చేసింది.