సారీ గురువుగారు..
ఇవాళ ఎందుకో గుర్తొచ్చారు. మీ గురించి రాయడం అంటే కాచిన పాల సముద్రంలో కరిగిన చక్కెరను వెతకడం లాంటిదని తెలిసి కూడా నాకొచ్చిన రెండు ముక్కలు చెప్పుకుందామని ఇది రాస్తున్నాను.
ఈ మధ్య హాస్యానికి మాగొప్ప నిర్వచనం ఇస్తూ కొందరు ఉద్దండ వర్ధమాన కమెడియన్లు టీవీల్లో ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఉంటే మరి అప్పట్లో మీరు సృష్టించిన దాన్ని ఏమంటారో అర్థం కాక చిన్న అయోమయం కలిగింది.
మరి మీరూ చిరంజీవి అంతటి హీరోతోనే ఆడ వేషం వేయించి నవ్వించారే. ఆరోగ్యంగా నవ్వించడం ఎలాగో ఒక దిక్సూచి లాగా చూపించారే. మరి ఇప్పుడు దిక్కుమాలిన ఆడంగి వేషాలను పదే పదే చూపిస్తూ అవహేళన చేస్తూ ఇంత గొప్ప హాస్యాన్ని రాయడానికి ఎంత కష్టపడాలో అంటూ వీళ్ళు నీతులు వల్లెవేస్తుంటే దానికి నవ్వాగడం లేదు గురువుగారు.
అదృష్టం కొద్దీ మీరు స్వర్గానికేగి తప్పించుకున్నారు కానీ.. లేదంటే మిమ్మల్ని కూడా ఇప్పటి టీవీ చానళ్లు లైవ్‌లో కూర్చోబెట్టి అప్పట్లో ఈ ఎక్స్ ట్రా కామెడీని ఎందుకు మీ సినిమాల్లో చూపించలేదని నిలదీసి మీ పరువు తీసేవారు. మీ యశోరేఖ బలంగా ఉండి ఈ గండం నుంచి తప్పించుకున్నారు.
ఒకావిడ హాస్యాన్ని హాస్యంలాగా చూడండి, నవ్వించే వాళ్ళను ఎందుకు ఏడిపిస్తారు అని భలేగా సెలవిచ్చింది. ‘అహ నా పెళ్ళంట’లో కోట పిసినారితనంతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన మీ చతురత ఇలాంటి మాటల ముందు బలాదూర్ అంటున్నందుకు క్షమించగలరు.
చూసే వాళ్లకు లేని బాధ మీకెందుకని డబ్బులు తీసుకుని కుర్చీలో కూర్చుని నవ్వే పెద్ద మనిషి నిర్వచిస్తున్నారు. నిజమే కదా. ద్వందార్థాలు పరమానందంగా స్వీకరించి ఇది సమాజంలో వచ్చిన సహజమైన మార్పుగా గుర్తించని నా లాంటి అర్భకులకు ప్రతిదీ ఇలా తప్పుగా కనిపించడానికి కారణం హాస్యం అంటే నాకిష్టమైన పాలకోవా అంత మధురం అనిపించేలా చేసిన మీ సినిమాలే.
మీరు తీసిన సినిమాలు, రాసిన మాటలు టెక్నాలజీ పుణ్యమా అని సజీవంగా ఉండి మాకు ఆక్సిజన్ ఇస్తున్నాయి కానీ లేదంటే ఈ పాటికి సగటు సినిమా అభిమాన మానవుడి మనశ్శాంతికి ఏనాడో శ్రద్ధాంజలి ఘటించాల్సి వచ్చేది.
వీలైతే ఓసారి రండి గురువుగారు. బారెడు చేతితో చెంపలు వాచిపోయేలా గూబ పగలగొట్టే రీతిలో హాస్యం అంటే ఏంటో ఈ తరానికి చెప్పండి.
లేదా భవిష్యత్ రచయితలు వెకిలితనమే హాస్యమని, ద్వందార్థాలు లేనిదే అవతలివాడిని నవ్వించలేమనే భ్రమలో తమ సృజనాత్మకతకు సంకెళ్లు వేసుకునే ప్రమాదం ఇప్పటికే మొదలైంది. కొంచెం దయతలచి రండి మాస్టారు.
జంధ్యాల గారి జ్ఞాపకాలతో..
-రవీంద్రనాథ్ శ్రీరాజ్, సినీ రచయిత