జాన్వికపూర్.. ఈ పేరు టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు వినిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే పదేళ్లుగా వినిపిస్తూనే ఉంది. ఈమెను టాలీవుడ్ కు తీసుకొచ్చేందుకు అప్పట్లో మెహర్ రమేష్ నుంచి ఇప్పటి త్రివిక్రమ్ వరకు అందరూ ప్రయత్నించారు. కానీ ఇప్పటివరకు ఎవ్వరూ జాన్విని టాలీవుడ్ కు తీసుకురాలేకపోయారు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ఈ ముద్దుగుమ్మ పేరు తెరపైకొచ్చింది.
అవును.. ఈసారి జాన్వి టాలీవుడ్ ఎంట్రీ పక్కా అంటున్నారు జనాలు. అది కూడా ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందంటూ కథనాలు వస్తున్నాయి.
ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బుచ్చిబాబు, ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. ఇప్పుడీ కథలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు బోనీ కపూర్ తో సంప్రదింపులు ప్రారంభించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Advertisements
ఇక్కడో గమ్మత్తైన విషయం చెప్పుకోవాలి. ప్రతిసారి టాలీవుడ్ లో జాన్వి కపూర్ పేరు ఎన్టీఆర్ సినిమాలతోనే లింక్ అవుతూ వినిపిస్తోంది. అప్పుడెప్పుడో మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ శక్తి అనే సినిమా తీస్తే, అందులో హీరోయిన్ గా జాన్వి కపూర్ పేరే వినిపించింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఈమె పేరు వినిపించింది. చివరికి ఆర్ఆర్ఆర్ లో కూడా జాన్విని తీసుకుంటారనే చర్చ జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్-బుచ్చిబాబు ప్రాజెక్టు కోసం జాన్వి పేరు మరోసారి తెరపైకొచ్చింది. కనీసం ఈసారైనా ఈ పుకార్లు నిజమౌతాయా?