శ్రీదేవి కూతురు సౌత్ కు ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురుచూశారు. ఇన్నాళ్లూ ఊరించిన జాన్వి కపూర్, ఇప్పుడు సౌత్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ముందుగా టాలీవుడ్ పై ఆమె కన్నుపడింది. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది. దీనికోసం ఆమె భారీ పారితోషికం కూడా తీసుకుంటోంది.
ఇప్పుడీ చిన్నది కోలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టింది. త్వరలోనే లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతోంది జాన్వి కపూర్. అది కూడా ప్రతిష్టాత్మక చిత్రం కావడం విశేషం.
13 ఏళ్ల కిందట పయ్యా అనే సినిమా తీశాడు లింగుస్వామి. కార్తి, తమన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఆ సినిమా కోలీవుడ్ లో పెద్ద హిట్టయింది. తర్వాత అదే సినిమా తెలుగులో డబ్ అయి, ఇక్కడ కూడా పెద్ద హిట్టయింది. తెలుగులో దీని పేరు ఆవారా.
ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు లింగుస్వామి. అలా అని అతడు కార్తిని రిపీట్ చేయడం లేదు. పూర్తిగా హీరోహీరోయిన్లు మార్చేస్తున్నాడు. హీరోగా ఆర్యను, హీరోయిన్ గా జాన్వి కపూర్ ను తీసుకోవాలనుకుంటున్నాడు. ఈ ప్రాజెక్టుకు జాన్వి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.