కరోనా కేసుల విషయంలో జనవరి నెల జర భద్రం అంటోంది కేంద్రం. నిజానికి ఇప్పటి నుంచి సుమారు 40 రోజులపాటు ఇండియాకు కాస్త ‘క్లిష్ట’ పరిస్థితేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన వర్గాలు చెబుతున్నాయి. జనవరి రెండో వారానికి దేశంలో కరోనా కేసులు పెరగవచ్చునని, గత ట్రెండ్ ని బట్టి ఈ అంచనాకు వచ్చామని పేర్కొన్నాయి. తూర్పు ఆసియా నుంచి కోవిడ్ వైరస్ 10 రోజుల్లో యూరప్ లో వ్యాపించిందని, అనంతరం మరో 10 రోజులకు అమెరికాను ‘తాకిందని’ ప్రకటించిన ఆరోగ్య శాఖ.. ముఖ్యంగా తూర్పు ఆసియాలో ‘అడుగు పెట్టిన తరువాత’ 30 నుంచి 35 రోజుల్లో ఇండియాను కొత్త వేవ్ ప్రవేశించిందని తెలిపింది.
ఇది గత అనుభవాన్ని బట్టి స్టడీ చేసినట్టు ఓ అధికారి తెలిపారు. కోవిడ్ వేవ్ ఉన్నప్పటికీ .. ఇన్ఫెక్షన్లు, హాస్పిటలైజేషన్లు తక్కువగానే ఉండవచ్చునని ఆయన చెప్పారు. కరోనా కేసులపై ఇప్పటికే ప్రజలకు తగిన గైడ్ లైన్స్ ని జారీ చేయడం జరిగిందని, అప్రమత్తంగా ఉండాలని సూచించామని ఆయన అన్నారు.
అంతర్జాతీయ ప్రయాణికులకు థర్మల్ టెస్టులు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 12 వేలమందికి పైగా ప్రయాణికుల్లో 39 మంది పాజిటివ్ కి గురయినట్టు వెల్లడైందని వివరించారు.
ఇదే సమయంలో మాస్కుల ధారణను తప్పనిసరి చేయాలని కేంద్రం భావించడం లేదు. కర్ణాటక వంటి రాష్ట్రాలు మాత్రం ముందు జాగ్రత్త చర్యగా సినిమా హాళ్లు, పార్కులు, మార్కెట్లు వంటివాటి చోట అప్పుడే దీన్ని తప్పనిసరి చేస్తూ ఈ నిబంధనను అమలులోకి తెచ్చాయి. ఇక భారత్ బయో టెక్ వారి నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ విషయంలో కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మరో అధికారి తెలిపారు. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 188 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా పరిస్థితిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తోంది.