జపాన్ ప్రధాన మంత్రి షింజే అబే భారత పర్యటన వాయిదా పడింది. పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతుండడంతో రెండు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. జపాన్ ప్రధాని పర్యటన త్వరలోనే ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గువహటిలో మూడు రోజుల పాటు జరగనున్న కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాన మంత్రి షింజే అబేలు పాల్గొనాల్సి ఉండడంతో ఆ కార్యక్రమం తాత్కాలికంగా రద్దయ్యింది. ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలతో గురువారం బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఎ.కె.అబ్దుల్ మెమెన్ తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం మేఘాలయాలో ఓ కార్యక్రమంలో అబ్దుల్ మెమెన్ పాల్గొనాల్సి ఉంది.