క్వాడ్ సదస్సు సమయంలో జపాన్ సమీపంలో రష్యా, చైనా యుద్ధ విమనాలు చెక్కర్లు కొట్టాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సమావేశం సమయంలో చైనా, రష్యాలు సంయుక్త యుద్ధ విన్యాసాలను నిర్వహించినట్టు జపాన్ రక్షణ మంత్రి నోబువో కిషి తెలిపారు.
ప్రాంతీయ భద్రతపై క్వాడ్ సభ్య దేశాలు చర్చిస్తున్న సమయంలో రష్యా, చైనాలు సంయుక్త విన్యాసం చేపట్టడంపై జపాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇరు దేశాలకు ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలిపింది.
అయితే ప్రాదేశిక గగనతల ఒప్పందాలను యుద్ధ విమానాలు ఉల్లంఘించలేదని జపాన్ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని రష్యా కూడా వెల్లడించింది. నవంబర్ తర్వాత జపాన్ సమీపంలో రష్యా, చైనా యుద్ధ విమానాలు కనిపించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనాతో కలిసి సంయుక్త విన్యాసాలు నిర్వహించినట్టు రష్యా తెలిపింది. సుమారు 13 గంటల పాటు జపాన్, తూర్పు చైనా సముద్రాలపై జాయింట్ పెట్రోలింగ్ నిర్వహించామని రష్యా పేర్కొంది.
క్వాడ్ సమావేశ సమయంలో రష్యా, చైనాలు ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని జపాన్ రక్షణ మంత్రి అన్నారు. దీన్ని రెచ్చగొట్టె చర్యగా ఆయన అభివర్ణించారు. దురాక్రమణలకు పాల్పడే రష్యా లాంటి దేశంతో చైనా ఇలాంటి విన్యాసాలు చేయడం ఆందోళన కలిగిస్తోందని, దాన్ని విస్మరించలేమన్నారు.