ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల పరిరక్షణ కోసం వ్యూహాత్మక భాగస్వామ్యంతో కలిసి పని చేయాలని భారత, జపాన్ దేశాలు నిర్ణయించాయి. ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా మధ్య సోమవారం జరిగిన చర్చల్లో ఈ అంశమే హైలైట్ అయింది. ఇండో పసిఫిక్ రీజన్ లో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలని తమ సమావేశంలో వీరు నిర్ణయించారు. ఇండియాలో రెండు రోజులు పర్యటించేందుకు కిషిదా ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఉభయ నేతల చర్చల్లో రష్యా-ఉక్రెయిన్ వార్, భారత, జపాన్ దేశాల గ్లోబల్ స్ట్రాటెజిక్ పార్ట్ నర్ షిప్, వివిధ రంగాల్లో సంయుక్త సహకారం పెంపొందడానికి గల అవకాశాలు మొదలైనవి ప్రధాన ప్రస్తావనాంశాలయ్యాయి.
జీ 20 కి ఇండియా అధ్యక్షత వహిస్తున్న సందర్భంలో ఈ దేశం ముందున్న ప్రాధాన్యతలను మోడీ.. కిషిదాకు వివరించారు. అలాగే జీ-7 కూటమికి జపాన్ నేతృత్వం వహిస్తున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో భారత-జపాన్ దేశాలు కలిసి కట్టుగా పని చేయడానికి ఇది మంచి అవకాశమని ఆయన చెప్పారు.
రక్షణ, డిజిటల్ టెక్నాలజీ, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, హెల్త్ వంటి రంగాల్లో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని ఉభయ నేతలూ అభిప్రాయపడ్డారు. సెమి కండక్టర్లు, ఇతర కీలక టెక్నాలజీల్లో ఒకరికొకరు సహకరించుకోవలసిన అంశాన్ని మోడీ ప్రధానంగా ప్రస్తావించారు.
మే నెలలో జరగనున్న జీ-7 సమ్మిట్ కు హాజరు కావలసిందిగా కిషిదా .. మోడీని కోరగా ఇందుకు మోడీ అంగీకరించారు. గత ఏడాది మార్చిలో తాను ఇండియాకు వచ్చినప్పుడు రానున్న ఐదేళ్లలో ఇండియాకు తమ దేశం నుంచి 3 లక్షల 20 వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ను ప్రకటించిన విషయాన్నికిషిదా గుర్తు చేశారు. గతంలో మోడీ, కిషిదా ఇద్దరూ మూడు సార్లు సమావేశమయ్యారు. భారత-జపాన్ దేశాల మధ్య మంచి మైత్రీ బంధం ఉంది. 2022 మార్చిలో రెండు దేశాల మధ్య జరిగిన చివరి శిఖరాగ్ర సమావేశం నుంచి ఢిల్లీ, టోక్యో వరుసగా జీ-20, జీ-7 కూటమి దేశాలకు అధ్యక్షత వహించాయి.