ఇగ్నిషన్ విఫలమవడంతో జపాన్ శాస్త్రవేత్తల నెలకష్టం మంటగలిసింది. జాతి ప్రయోజనాల కోసం శ్రమించి తయారు చేసిన రాకెట్ ను తామే చేతులారా కూల్చివేయాల్సి వచ్చింది.
ఇరవైరెండేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత కొత్త రాకెట్ సిరీస్‌ను ప్రయోగించిన జపాన్ అంతరిక్ష ఏజెన్సీకి ఎదురుదెబ్బ తగిలింది. H3 రాకెట్ రెండో దశ వైఫల్యం కారణంగా దారి మధ్యలోనే కూల్చివేయాల్సి వచ్చింది.
ఆరు నెలల కాలంలో జపాన్ అంతరిక్ష కార్యక్రమానికి ఎదురైన రెండో వైఫల్యం ఇది. ఈ H3 రాకెట్ అత్యాధునిక భూ పరిశీలనా ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది.
మ్యాప్‌ల తయారీ, విపత్తు స్పందన కోసం డేటా సేకరణకు ఈ ఉపగ్రహం ఎంతగానో ఉపయోగపడుతుంది. దక్షిణ జపాన్‌లోని తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించారు. తొలుత సవ్యంగానే ఇది ప్రయాణించింది. అనుకున్న ప్రకారమే రెండోదశ విడిపోయింది.
ఆ సమయంలో ఇగ్నిషన్ విఫలమవడం వల్ల మిషన్‌పై ఇక ఎలాంటి ఆశలు లేవని నిర్ణయించుకున్న తర్వాత రాకెట్‌ను ధ్వంసం చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకున్నారు. రాకెట్ వైఫల్యానికి గల కారణంపై శాస్త్రవేత్తలు దర్యాప్తు చేస్తున్నారు.