రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ పై ఎంపీ జయాబచ్చన్ ఫైర్ అయ్యారు. కోపంలో ఆయన వైపు వేలు చూపిస్తున్నట్టు కనిపిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోను షేర్ చేస్తూ జయాబచ్చన్ పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. జయ బచ్చన్ తీరుపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
రాజ్య సభలో జయాబచ్చన్ ప్రవర్తించిన తీరు ఖండించదగినదని బీజేపీ నేత అజయ్ సెహ్రావత్ అన్నారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సలహాదారు కంచన్ గుప్తా దీనిపై ఫైర్ అయ్యారు. ఈ వీడియో తనకు యూపీఏ అధికారంలో ఉన్న సమయాన్ని గుర్తు చేసిందని పేర్కొన్నారు.
ఇటీవల పార్లమెంట్‌లో అదానీ గ్రూప్సుపై హిండెన్ బర్గ్ నివేదికపై పార్లమెంటులో రచ్చ జరిగింది. దీనిపై జేపీసీ వేసి విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సభ నిబంధనలు ఉల్లంఘించినందుకు
కాంగ్రెస్ రాజ్య సభ ఎంపీ రజనీ పాటిల్‌ను సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఈ క్రమంలో ఎంపీ రజనీ పాటిల్ కు మద్దతుగా జయాబచ్చన్ మాట్లాడుతూ… ఆమెకు స్పష్టత ఇవ్వడానికి అవకాశం ఇవ్వలేదని అన్నారు. ఆమె సస్పెన్షన్ అవమానకరమైన రీతిలో జరిగిందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఏదైనా తప్పు జరిగిందని భావిస్తే, వారు దానిని కమిటీకి పంపాలి అని చెప్పారు. ఆ సమయంలో రాజ్యసభ చైర్మన్ ను ఆమె వేలుతో చూపిస్తూ ఏదో అన్నట్టు వీడియో ద్వారా తెలుస్తోంది.