జయ ఆస్తి వెయ్యి కోట్లు, బిగ్‌బీ పెన్ ఖరీదు 9 లక్షలు

నటి, బిగ్‌బి అమితాబ్ వైఫ్ జయాబచ్చన్ రాజ్యసభ‌సభ్యుల్లోనే అత్యంత ధనవంతురాలిగా నిలిచారు. ఆమె ఆస్తి విలువ అక్షరాలా వెయ్యి కోట్లు. 2012లో రూ.493 కోట్లు కాగా.. ఈ ఐదేళ్లలో అది వెయ్యి కోట్లకు చేరింది. సమాజ్‌వాదీ పార్టీ తరపున ఎంపీగా బరిలోకి దిగిన ఆమె, తన నామినేషన్ పత్రాల్లో తన ఆస్తి వెయ్యి కోట్లుగా ప్రస్తావించారు. 2014లో బీజేపీ ఎంపీ రవీంద్ర కిషోర్ సిన్హా ఆస్తి విలువ 800 కోట్లు కాగా, ఆయన్ని మించేశారు జయాబచ్చన్.

జయా- అమితాబ్ దంపతులకు ఫ్రాన్స్‌లోని బ్రిగ్నోగాన్ ప్లేగ్‌లో 3,175 చదరపు గజాల విస్తీర్ణంలో ఓ భవనం వుంది. దీంతోపాటు నోయిడా, భోపాల్, పూణే, అహ్మదాబాద్, గాంధీనగర్ నగరాల్లో ఆస్తులున్నాయి. జయాబచ్చన్‌కు లక్నోలోని కకోరీ ప్రాంతంలో 2.2 కోట్ల విలువ గల 1.22 హెక్టార్ల వ్యవసాయ భూమి, అమితాబ్‌కు బరాబంకీ జిల్లా దౌల్తాపూర్ లో 5.7 కోట్ల విలువగల మూడు ఎకరాల భూమి ఉందని అఫిడవిట్‌లో ప్రస్తావించారు. తమ వద్ద 62 కోట్ల గోల్డ్, 13 కోట్ల విలువ గల 12 కార్లు ఉన్నాయి. అందులో రోల్స్ రాయిస్, మూడు మెర్సిడెస్, ఒక ఫోర్డ్, రేంజ్ రోవర్, టాటా నానోకార్లతోపాటు ఓ ట్రాక్టర్ ఉన్నట్లు తెలియజేశారు. అమితాబ్‌కు 9 లక్షల విలువ చేసే పెన్ కూడా ఉంది. ఇదండీ బచ్చన్ ఫ్యామిలీ ఆస్తులు.