కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా నటించింది సుమ. ఆ తర్వాత టీవీ షోలు, పెళ్లి, పిల్లలు, బుల్లితెరపై స్టార్ స్టేటస్.. ఇలా బిజీ అయిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె వెండితెరపైకొచ్చింది. అప్పుడు హీరోయిన్ గా పరిచయమైన ఈ స్టార్ యాంకర్, ఇప్పుడు లీడ్ రోల్ లో పరిచయమైంది. అదే జయమ్మ పంచాయితీ.
సుమ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా ట్రయిలర్ విడుదలైంది. స్వయంగా పవన్ కల్యాణ్ ఈ సినిమా ట్రయిలర్ ను లాంచ్ చేసి, సుమతో పాటు యూనిట్ అందరికీ శుభాకాంక్షలు అందజేశారు. ఇలా జయమ్మ పంచాయితీ సినిమాకు చాలా పెద్ద ప్రమోషన్ దక్కింది.
ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. ఓ పల్లెటూరులో ఉండే మహిళ జయమ్మ. సరదాగా సాగిపోయే ఆమె కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. నిజానికి ఇది ఒక సమస్య కాదు, ఒకే కుటుంబంలో 2-3 సమస్యలు. వాటిని పరిష్కరించడం కోసం పంచాయితీ పెడుతుంది జయమ్మ. నేరుగా వెళ్లి పంచాయతీ పెద్దల్ని కలుస్తుంది.
సరిగ్గా అప్పుడే ఆమె సమస్య కాస్తా ఊరి సమస్యగా మారుతుంది. అది మొత్తం జిల్లాకు వ్యాపిస్తుంది. రోజూ పేపర్లలో పడుతుంటుంది. అలా జయమ్మ వార్తల్లోకెక్కుతుంది. ఇంతకీ జయమ్మ సమస్య ఏంటి? అది ఊరి సమస్యగా ఎలా మారింది? దానికి పరిష్కారం ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రయిలర్ చూస్తుంటే.. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్టుంది.
అన్నట్టు ఈ సినిమాలో జయమ్మ పాత్రధారిలో సుమతో బూతు డైలాగ్ కూడా చెప్పించారు. ఈమధ్య ఇది కామన్ అయిపోయింది. పాత్ర డిమాండ్ చేస్తే బూతు పెట్టడానికి మేకర్స్ అస్సలు తగ్గడం లేదు. ఇందులో భాగంగా జయమ్మతో కూడా బూతు చెప్పించారు. మే 6న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను బలగ ప్రకాష్ నిర్మించారు.