సుమారు 7 వేల కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన ప్యాకేజ్డ్ బిస్లెరి వాటర్ కంపెనీని దీని యజమాని, పారిశ్రామికవేత్త రమేష్ చౌహాన్ టాటా కన్స్యూమర్ ప్రాడక్ట్స్ సంస్థకు కట్టబెట్టబోతున్నారని తెలుస్తోంది. దీని స్వాధీనానికి సంబంధించి ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు జరిగినప్పటికీ.. టాటా సంస్థకే ఇక బిస్లెరి నిర్వహణా బాధ్యతలను అప్పజెప్పవచ్చునని సమాచారం.
ఈ సంస్థ కూడా తాము బిస్లెరి ఇంటర్నేషనల్ తో సంప్రదింపులు జరుపుతున్నామని, దీని బిజినెస్ ని విస్తరించే యోచనలో ఉన్నామని తెలిపింది. అయితే తమ మధ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని 82 ఏళ్ళ రమేష్ చౌహాన్ వెల్లడించారు. టాటా గ్రూప్ తో తమ అగ్రిమెంట్ ఖరారైందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. నిజానికి ఇంత పెద్ద సంస్థను చేబట్టేందుకు ఆయన కుమార్తె జయంతి చౌహాన్ ముందుకు వస్తుందని అంతా భావించారు.
కానీ తమ సంస్థ బిజినెస్ బాధ్యతలు చేబట్టేందుకు ఆమెకు ఆసక్తి లేదని ఆయన తెలిపారు. లోగడ అమెరికాలోని లాస్ఏంజిల్స్ లో ఫ్యాషన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మెర్కండైజింగ్ విభాగంలో ప్రాడక్ట్ డెవలప్మెంట్, మిలనోలో ఫ్యాషన్ స్టైలింగ్, లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ లో ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ ఫొటోగ్రఫీవంటివి స్టడీ చేసిన ఆమె కొంతకాలం వరకు తమ బిస్లెరి సంస్థలో వివిధ కీలక పదవులు చేబట్టి బాధ్యతలు నిర్వహించారు.
ప్రస్తుతం తమ సంస్థ వైస్ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. జేఆర్సీ గా పాపులరైన ఆమె 24 ఏళ్ళ వయస్సులోనే తమ సంస్థలో హెచ్ ఆర్, సేల్స్ మార్కెటింగ్ వంటి శాఖలను పునర్వ్యవస్థీకరించారు. 2011 లో ముంబైలో తమ కార్యాలయ నిర్వహణా బాధ్యతలు చేబట్టారు. బిస్లెరి మినరల్ వాటర్, వేదికా నేచురల్ మినరల్ వాటర్, ఫిజ్జీ ఫ్రూట్ డ్రింక్స్, బిస్లెరి హ్యాండ్ ప్యూరిఫయర్ లాంటి రకరకాల వెరైటీ ఉత్పత్తుల ఆపరేషన్లను జయంతి చౌహన్ నిర్వహించారు. అయితే ఇన్ని కీలక బాధ్యతలు చేబట్టిన ఈమె ఇప్పుడు తమ సంస్థ బిజినెస్ చూసుకునేందుకు అనాసక్తి చూపుతున్నారు.