కడప: చంద్రబాబు ఆలోచనలపైనే రాష్ట్రంలో బీజేపీ ఆధారపడి వుందని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కడపంలో సెన్సేషనల్ కామెంట్ చేశారు. ‘రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనం మొదలైంది. అది ఎక్కువైనా కావచ్చు, తక్కువైనా కావచ్చు. దీనికి ప్రతిపక్ష నేత చంద్రబాబు పరోక్ష పాత్ర ఎంతైనా ఉంది. ఆయన ఆలోచనల పైనే రాష్ట్రంలో బీజేపీ ఆధారపడి ఉంది…’ అంటూ దివాకర్‌రెడ్డి నర్మగర్భంగా మాట్లాడాడు. బీజేపీ రాష్ట్రంలో బలపడటానికి, చంద్రబాబు ఆలోచనా సరళికి సంబంధం ఏంటో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. టీడీపీ బలహీనపడితే బీజేపీ బలపడుతుందనే అర్ధంలో అన్నారా.. లేక రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ మళ్లీ జతకట్టి వైసీపీ పునాదులు కదిల్చే దిశగా నడుస్తాయని జోస్యం చెప్పారా అనేది ఎవరికీ అర్ధం కాలేదని పరిశీలకులు అంటున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనల పైనే ప్రాంతీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయని, జమిలి ఎన్నికల కారణంగా ప్రాంతీయ పార్టీలు కనుమరుగు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని జేసీ దివాకర్‌రెడ్డి తన అభిప్రాయంగా చెప్పుకురావడం ప్రస్తావనార్హం.