అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ మరోసారి కోర్టుకెక్కింది. సోమవారం ఆయనపై మొత్తం కోటి డాలర్లకు పరువునష్టం దావా వేసింది. 1996 లో మన్ హటన్ ఎవెన్యూ లోని బెర్గ్ డార్ఫ్ గుడ్ మన్ డిపార్ట్మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్ లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. 2019 లో ఓ సారి తనగురించి మళ్ళీ అసభ్యంగా మాట్లాడి తన పరువుకు భంగం కలిగించారని పేర్కొంది. ఈమె ఆరోపణలపై 9 మంది సభ్యులతో కూడిన న్యూయార్క్ జ్యురీ రెండు వారాల క్రితం విచారణ జరిపి.. ట్రంప్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడన్న విషయం నిజమేనని పేర్కొంది.
ఆమెకు 50 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే ట్రంప్ పై కారోల్ చేసిన అత్యాచారం ఆరోపణల్లో మాత్రం వాస్తవం లేదని, కానీ ఇతర ఆరోపణలు నిజమేనని జ్యురీ అభిప్రాయపడింది. ఈ తీర్పు తరువాత కూడా ట్రంప్.. సీఎన్ఎన్ టౌన్ హాల్లో ఈ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కారోల్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.
ఆమె ఆరోపణలు అబద్ధమని, అన్నీ కట్టుకథలేనని అన్నారు. జ్యురీ తీర్పు తనను అవమానపరిచే విధంగా ఉందని, ఆ కాలమిస్ట్ ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న 76 ఏళ్ళ ట్రంప్ పై 79 ఏళ్ళ కారోల్ లోగడ దావా వేసింది.
ఏమైనా.. ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో కూడిన ఫెడరల్ జ్యురీ.. కారోల్ పరువుకు భంగం కలిగించాడంటూ ఇందుకు ట్రంప్ ను బాధ్యుడిని చేసింది. తనపై అత్యాచారం జరిగిందని కారోల్ నిరూపించలేకపోయినప్పటికీ ట్రంప్ ఆమెను లైంగికంగా వేధించాడని నమ్ముతున్నట్టు ఈ జ్యురీ మరోసారి పేర్కొంది.