కేసీఆర్ పై జేపీ నడ్డా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సీఎం పెద్ద అవినీతి పరుడని.. కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడేశారని చేసిన విమర్శలపై టీఆర్ఎస్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్స్ వస్తున్నాయి. నడ్డా ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. బండి సంజయ్, అరవింద్ పై పీడీ యాక్ట్ లు పెట్టాలని.. ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ లీడర్లు గల్లీ లీడర్లు రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ కు నడ్డా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. లేదంటే పశ్చిమ బెంగాల్ మాదిరిగా ఉరికించి కొడతామని హెచ్చరించారు. చిల్లర మాటలు మాట్లాడితే రాష్ట్రంలో ఉన్న మూడు సీట్లు కూడా పోతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథను కేంద్రం ప్రశంసించిందని గుర్తు చేశారు. నీతి ఆయోగ్ రాష్ట్ర పథకాలకు ఇచ్చిన ప్రశంసలు తెలుసుకోవాలని సూచించారు.
తెలంగాణ ఉద్యమంలో బీజేపీ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు జీవన్‌రెడ్డి. బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. తమది స్కీముల పార్టీ అయితే.. బీజేపీది స్కాముల పార్టీ అని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ కుంభకోణాల పార్టీలని మండిపడ్డారు జీవన్ రెడ్డి