నిర్మాతల మండలిలో ఆధిపత్య పోరు, మా లో ఉన్న లుకలుకపై రకరకాల వార్తలు షికారు చేస్తున్న తరుణంలో… జీవితా రాజశేఖర్ ఎట్టకేలకు నోరు విప్పారు. ఎందుకు హడావిడిగా సమావేశం పెట్టాల్సి వచ్చింది, ఆ మీటింగ్ ఉద్దేశం ఎంటో వివరించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపైనా జీవితారాజశేఖర్ స్పందించారు.
నిర్మాతల మండలి హాలులో ‘మా ‘సమావేశం లో జరిగిన గందరగోళం పై జీవిత రాజశేఖర్ వివరణ ఇచ్చారు. సీనియర్ నరేశ్ అధ్యక్షుడిగా, డా. రాజశేఖర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జనరల్ కార్యదర్శిగా జీవిత రాజశేఖర్ ‘మా’ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఆదివారం జరిగిన సమావేశం గురించి సామజిక మాధ్యమాల్లో వివిధ రకాలుగా వార్తలు చక్కర్లు కొట్టటంతో జీవిత మీడియా ముందుకు వచ్చారు.
ఈ సందర్బంగా జీవిత మాట్లాడుతూ..
‘ఆదివారం 9గంటలనుంచి సాయత్రం 5.30 గంటలవరకు సమావేశం జరిగింది. ముఖ్యంగా 26 మంది కమిటీ సభ్యుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. వాటిని మేం సాల్వ్ చేసుకోలేకపోయాం. దానికి కొన్ని కారణాలూవున్నాయి. ఈ క్రమంలో వాదోపవాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఏదిఏమైనా ఉపయోకరమైన సమావేశం అని గట్టిగా చెప్పగలను. మెజారిటీ సభ్యులు అత్యవసరంగా ‘ఎక్స్‌ట్రాడ్‌నరీ జనరల్‌బాడీ మీటింగ్’ పెట్టుకోవాలని సూచనలు చేశారు. దానికి సంబంధించిన బైలా ప్రకారం ఏం చేయాలనేది పరిశీలించాం. ఆ సమావేశంలో ‘మా’ లాయర్ గోకుల్‌గారు, కోర్టులో కేసు వేసిన వరప్రసాద్‌గారు కూడా వున్నారు. అందరూ కలిసి ఎక్స్‌ట్రాడినరీ జనరల్‌బాడీ మీటింగ్ జరగాలని అనుకోవడం జరిగింది. ‘మా’ సభ్యుల్లో 900పైగా వున్నారు. అందులో 20శాతం మంది సభ్యులు ఆమోదం తెలిపితే ఎక్స్‌ట్రాడినరీ జనరల్‌బాడీ జరుగుతుంది. అప్పుడే ‘మా’ సమస్యలు పరిక్షరించుకోవడానికి అవకాశం వుంటుంది. 20శాతం సభ్యులు ఆమోదం తెలిపితే అప్పటినుంచి 21రోజుల్లోగా మీటింగ్ పెట్టుకోవాల్సివుంటుంది. ఇలా మీటింగ్ జరిగితేనే అందరికీ మంచి జరుగుతుంది. కనుక సమస్యలు పరిష్కారం కావాలని కోరుకునే సభ్యులందరూ ‘మా’ ఆఫీసుకు రావడానికి సాధ్యం కాకపోతే ఈమెయిల్‌ద్వారానో, పోస్ట్ ద్వారానో, ఆఫీసుకువచ్చేవీలున్నవారు వచ్చి సంతకాలతో ఆమోదం తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని జీవిత రాజశేఖర్ కోరారు.