ఆ ముగ్గురికీ.. జీవితా రాజశేఖర్ ఘాటు హెచ్చరిక!

కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో మహిళా సంఘం నేతల ఆరోపణలపై మండిపడ్డారు జీవిత రాజశేఖర్. ఓ ఛానెల్‌లో జరిగిన చర్చలో తమపై తీవ్రస్థాయి ఆరోపణలు చేయడం, ఆపై యూట్యూబ్‌ ఛానెళ్లు ఇష్టమొచ్చినట్టు రాయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తనపై, తన కుటుంబసభ్యులపై అసత్య ఆరోపణలను ప్రసారం చేసిన ఛానెల్ మీద కేసు పెడతానని కూడా హెచ్చరించారు. గత కొద్దిరోజులుగా నలుగుతున్న కాస్టింగ్ కౌచ్‌ రగడపై స్పందించడానికి మీడియా ముందుకొచ్చిన జీవిత.. టాలీవుడ్‌కి సంబంధించిన అనేక విషయాలపై వివరణ ఇచ్చారు. ఆడవాళ్లని లోబరుచుకోవడం అనేది అన్నిరంగాల్లోనూ వుందని, కేవలం సినిమా రంగాన్ని మాత్రమే టార్గెట్ చేయడం ఎంతవరకు భావ్యమని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు రోడ్డుమీదకొచ్చిన శ్రీరెడ్డికి అసలేం కావాలన్న క్లారిటీ ఎవరికీ లేదన్నారు. అనవసర రాద్ధాంతం అవుతుందనే భయంతోనే సినిమా పెద్దలెవరూ ఈ విషయంపై స్పందించడానికి ముందుకు రావడంలేదని, తన కుటుంబాన్ని ఇందులో లాగడం వల్లే తానిలా రియాక్ట్ కావాల్సివచ్చిందని వివరించారు. తనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేకపోయినా, ఒంటరిగా పోరాడే ధైర్యం వుందని, తమ మీద లేనిపోనివి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు జీవిత రాజశేఖర్.

మహిళా సంఘం నేత సంధ్య విషయంలో జీవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. నాలుగేళ్ల కిందటి ఒక ఫోన్ కాల్‌ని పట్టుకుని ఇప్పుడు తమ ఫ్యామిలీని బదనాం చేయడానికి ఆమెకి హక్కు ఎక్కడిదంటూ ప్రశ్నించారు. తనకొక గౌరవప్రదమైన కుటుంబం, పెళ్లి కావాల్సిన అమ్మాయిలు వున్నారన్న విషయాన్ని మరిచిపోయి నీచమైన ఆరోపణలు చేసిన సంధ్యను ఊరికే వదిలే ప్రసక్తి లేదంటోంది జీవిత. ఇప్పటికే సంధ్య మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, త్వరలో పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమవుతోంది. దాసరి లేనిలోటు సినిమా పరిశ్రమలో స్పష్టంగా కనిపిస్తోందని, ఇటువంటి క్లిష్ట సమయాల్లో ఇండస్ర్టీ తరపున గట్టిగా నిలబడి మాట్లాడటానికి తాను సిద్ధంగా వున్నానని జీవిత పెద్దరికాన్ని చాటుకుంది.ఏదో ‘అన్యాయం’ జరిగిందంటూ ఇండస్ట్రీ మొత్తాన్ని బదనాం చేస్తున్న శ్రీరెడ్డికి, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలతో మనస్తాపానికి గురి చేసిన మహిళానేత సంధ్యకు, టీఆర్పీ రేటింగ్ కోసం పనికిమాలిన డిబేట్లు పెట్టే టీవీ ఛానెళ్లకు జీవితా రాజశేఖర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘‘చూస్తాను మీ సంగతంటూ’’ చూపుడు వేలితో హెచ్చరించిన జీవిత, కాస్టింగ్ కౌచ్ ఎపిసోడ్ ని కొత్త మలుపు తిప్పేసింది.