అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక వాషింగ్టన్ పోస్టును అమ్మకానికి పెడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దాని యజమాని జెఫ్ బేజోస్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాషింగ్టన్ కమాండర్స్ ఫుట్ బాల్ జట్టును కొనుగోలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలను వాషింగ్టన్ పోస్టు అధికారులతో పాటు జెఫ్ బేజోస్ కూడా ఖండించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. వాషింగ్టన్ పోస్ట్‌ను అమ్మడం లేదంటూ ఆయన స్పష్టత ఇచ్చారు. వాషింగ్టన్ పోస్టు అమ్మడం లేదని ఇప్పటికే పత్రికా సిబ్బందికి బెజేస్ చెప్పినట్టు సమాచారం.
2013లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ 250 మిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టి వాషింగ్టన్ పోస్టు పత్రికను సొంతం చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పత్రికను దక్కించుకోవడం తన లక్ష్యం కాదన్నారు.
తనకు ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఈ క్రమంలో వాషింగ్టన్ కమాండర్స్ అనే ఫుట్ బాల్ జట్టును కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ పోస్టును అమ్మకానికి పెట్టారంటూ అమెరికా మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి.