కరోనా మహమ్మారి భారత్‌లో బంగారం కొనుగోళ్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించడమే కాదు.. విప్లవాత్మక మార్పులను కూడా తీసుకొచ్చింది. గతంలో ఎవరైనా బంగారాన్ని కొనాలంటే కచ్చితంగా జువెల్లరీ షాపులకు వెళ్లి, దాన్ని కళ్లతో చూస్తేగానీ సంతృప్తి చెందేవారు కాదు. కానీ కరోనా, లాక్‌డౌన్ చాలాకాలం అలాంటి అవకాశం లేకుండా చేసింది. షాపులన్నీ మూతబడటంతో కొనుగోళ్లు లేక, కొనలేక అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు చాలా ఇబ్బందులుపడ్డారు. అయితే ఈ సమస్య ఓ కొత్త ట్రెండ్‌కు దారి తీసింది.
బయటకు వెళ్లలేని వినియోగదారులు క్రమంగా ఆన్‌లైన్‌లో గోల్డ్‌ను కొనడం మొదలుపెట్టారు. అటు దీనికి తగ్గట్టే తనిష్క్, కల్యాణ్ జువెల్లర్స్ ఇండియా లిమిటెడ్, పీసీ జువెల్లర్ లిమిటెడ్, సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి సంస్థలు కూడా తమ వ్యాపార పంథాను పూర్తిగా మార్చుకుంటూ వచ్చాయి. ఆన్‌లైన్‌లో రూ .100కు సరిపడా బంగారాన్ని కూడా విక్రయించడం మొదలుపెట్టాయి. నేరుగా తమ సంస్థల వెబ్‌సైట్ల నుంచి లేదా.. ఇతర డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్స్ నుంచి వ్యాపారం చేయడం ప్రారంభించాయి. వినియోగదారులు ఎప్పుడైతే ఒక గ్రామ్‌కు సరిపడా బంగారం చెల్లిస్తారో… అప్పుడు దాన్ని డెలివరీ చేయడం షురూ చేశాయి.
దేశంలో డిజిటల్ గోల్డ్ సేల్స్ విధానం కొత్తేమీ కాదు. మొబైల్ వ్యాలెట్లు, ఆగ్మంట్ గోల్డ్ ఫర్ ఆల్, సేఫ్ గోల్డ్ వంటి సంస్థలు ఎప్పటి నుంచో ఆన్‌లైన్‌లో బంగారాన్ని విక్రయిస్తున్నాయి. జువెల్లరీ షాపులు మాత్రం తమ ఆభరణాలను ఆన్‌లైన్‌లో అమ్మడానికి వెనకాడుతూ వచ్చాయి. కానీ కరోనా సంక్షోభం వారి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసింది.
పండగల వేళ బంగారం కొనుగోళ్లకు ఉండే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా సంస్థలు ఆన్‌లైన్ వేదికగా కూడా ఆఫర్లను అందిస్తున్నాయి. దీంతో చాలా మంది కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా యువతరం ఈ- కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 2019లో మొత్తం బంగారం కొనుగోళ్లలో కేవలం 2 శాతం మాత్రమే ఆన్‌లైన్ కొనుగోళ్లు ఉన్నాయని.. కానీ ఇప్పుడు అవి 200 శాతానికిపైగా పెరిగిపోయాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రూ.3-4 వేల విలువ ఉండే కాయిన్స్, బిస్కెట్లను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారని అంటున్నారు.