టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో… అర్జున్‌రెడ్డి సక్సెస్‌తో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన విజయ్ దేవరకొండ కేవలం సినిమా హీరోగానే కాకుండా, తను లాంఛ్ చేసిన స్పెషల్ డ్రెస్సెస్ బ్రాండ్ “రౌడీ వేర్”తో కూడా యువతరం మనసులు దోచుకున్నాడు. అంతా బానే ఉంది, తనకిక తిరుగులేదు అనుకుంటున్న సమయంలో భారీ అంచనాల మధ్య విడుదలయి, విజయ్ ఖాతాలోకి మరో సూపర్ హిట్ చేరిపోయింది అనుకున్న “డియర్ కామ్రేడ్” కాస్తా తుస్సుమనడంతో అయోమయంలో పడిపోయాడు విజయ్.
అప్పుడెప్పుడో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఈ హీరోతో ఓ సినిమా తీద్దామని ప్రయత్నాలు చేస్తే అస్సలు కుదర్లేదు పాపం. కృష్ణానగర్ లో గుప్పుమంటున్న వార్తలు నిజమయితే, రీసెంట్‌గా పూరీని ఫ్లాపుల సంద్రం నుంచి గట్టెక్కించిన మాస్ మసాలా సినిమా “ఇస్మార్ట్ శంకర్” కథను విజయ్ కోసమనే పూరీ రాసుకున్నాడట. కానీ కుదరకపోవడంతో కాస్త అటుఇటుగా మార్చి ఎనర్జిటిక్ స్టార్ రాం పోతినేనితో తెరకెక్కించడం, సూపర్ డూపర్ హిట్ అందుకోవడం జరిగిపోయింది.
ఇప్పుడు బళ్ళు ఓడలయ్యాయ్, ఓడలు కాస్తా బళ్ళయిపోయాయ్! సీన్ రివర్స్ అయిపోయింది కాబట్టి విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్‌కి ఓకే చెప్పేశాడు. పూరీ, ఛార్మీ జాయింట్ వెంచర్ పూరీ కనెక్ట్స్ సంస్థే ఈ సినిమా నిర్మించబోతున్నట్టుగా ఆల్రెడీ నిర్మాత హోదాలో ఛార్మీ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. ట్విట్టర్లో పూరీ, విజయ్‌లతో కలిసి ఛార్మీ సెల్ఫీ క్లిక్ చేసి మరీ దానికి ఈ వార్తను ట్యాగ్ చేసింది.
ఆ సినిమా గురించి ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో మస్తు మస్తు వార్తలు షికార్లు చేస్తున్నాయి. పూరీ, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా చేయబోతున్నానని లాంగ్ లాంగ్ ఎగో ప్రకటించిన “జనగణమన” స్టోరీకే కాసిన్ని ఇస్మార్ట్ రిపేర్లు చేసి విజయ్‌తో తీస్తున్నాడట. అలాగే ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా అతిలోక సుందరి, అందాల శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే జాహ్నవి తనకు టాలీవుడ్ హీరోల్లో విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని, ఛాన్స్ వస్తే తనతో కలిసి నటించాలనుకుంటున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇదే అవకాశంగా భావించి తనను ఈ సినిమాతో టాలీవుడ్‌కి తీసుకురావాలని నిర్మాత ఛార్మీ గట్టిగానే ప్రయత్నాలు మొదలెట్టినట్టు భోగట్టా. ఇది నిజమా లేక పుకారా? నిజం అయితే మరి జాహ్నవి ఒప్పుకుంటుందా? రౌడీ బాబుతో జత కట్టి టాలీవుడ్ తెరంగేట్రం చేస్తుందా? వెరీ సూన్… ఈ అనుమానాలన్నీ తీరిపోతాయేమో చూద్దాం.