ఝార్ఖండ్ నటి రియా కుమారి హత్య కేసులో ఆమె భర్త ప్రకాష్ కుమార్ ను పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. తమ మూడేళ్ళ కూతురితో బాటు రియా కుమారి, ప్రకాష్ కుమార్ రాంచీ నుంచి కోల్ కతా వెళ్తుండగా మధ్య దారిలో ప్రకాష్ ఏదో పనిమీద కారును ఆపగా ముగ్గురు దండగులు రియా కుమారిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే మరణించింది.
ఈ కేసులో కోల్ కతా పోలీసులు మొదటి నుంచి ప్రకాష్ కుమార్ ని అనుమానిస్తూనే ఉన్నారు. తమను ముగ్గురు దోపిడీ దారులు అడ్డగించారని, వారిని తాను ప్రతిఘటించబోగా తన భార్యపై కాల్పులు జరిపారని ప్రకాష్ .. పోలీసులకు చెప్పాడు. అయితే అతని మాటలు విశ్వసించదగినవిగా లేవని వారు భావించారు.
తమ కూతురు రియా కుమారి హత్యకు సంబంధించి తమకు అనుమానాలు ఉన్నాయని, సినీ దర్శకుడైన ప్రకాష్.. రియా కుమారిని మానసికంగా, శారీరకంగా వేధించేవాడని ఆమె తలిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని సినిమాలను, యాడ్స్ ను కూడా నిర్మించిన ప్రకాష్ కి మైనింగ్ బిజినెస్ కూడా ఉందని తెలిసింది.
పోలీసులు నిన్న ఈ క్రైమ్ జరిగిన చోటుకు ప్రకాష్ ని తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారని తెలిసినప్పుడే .. అతడు రియాకుమారిని హత్య చేయడానికి పథకం పన్నాడని భావిస్తున్నారు. ఝార్ఖండ్ లో రియాకుమారిని ఈషా అల్యాగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రకాష్ ని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.