జాతీయ రాజకీయాల మంత్రం జపిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సమావేశమయ్యారు. కేంద్రంపై పోరాటానికి సంబంధించి టీఆర్ఎస్ ప్లీనరీలో కార్యాచరణ ప్రకటించిన తర్వాత రోజే వీరిద్దరూ కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ వచ్చిన సోరెన్.. సాయంత్రం ప్రగతి భవన్ కు వెళ్లారు. కేసీఆర్ తో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఇద్దరు నేతలు చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. గతంలోనూ హేమంత్ హైదరాబాద్ లో ఓసారి కేసీఆర్ తో సమావేశమయ్యారు.
ఇటీవల రాంచీ వెళ్లిన సీఎం కేసీఆర్ గాల్వాన్ లోయలో అమరులైన జార్ఖండ్ సైనికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందించారు. ఆ సమయంలో కూడా జాతీయ రాజకీయాలపై చర్చించారు కేసీఆర్, హేమంత్,
తాజాగా మరోమారు ఇద్దరు ముఖ్యమంత్రులు హైదరాబాద్ వేదికగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మరోసారి దేశ రాజకీయాలతో పాటు కేంద్రం అనుసరిస్తున్న వైఖరి సహా ఇతర అంశాలపై చర్చించారని తెలుస్తోంది.